Share News

GST Interest Rules: ఐటీసీతో పన్ను చెల్లింపులు వడ్డీ మినహాయింపు ఎప్పుడు

ABN , Publish Date - Aug 24 , 2025 | 04:07 AM

జీఎ్‌సటీలో నమోదై రిటర్న్‌ దాఖలు చేస్తూ పన్ను చెల్లించే వారిలో చాలా మందికి ఉండే ఆలోచన ఏమిటంటే పన్ను చెల్లింపు ఆలస్యమైనప్పటికీ ఆ మొత్తాన్ని నగదు ద్వారా కాకుండా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) ద్వారా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ....

GST Interest Rules: ఐటీసీతో పన్ను చెల్లింపులు వడ్డీ మినహాయింపు ఎప్పుడు

జీఎ్‌సటీలో నమోదై రిటర్న్‌ దాఖలు చేస్తూ పన్ను చెల్లించే వారిలో చాలా మందికి ఉండే ఆలోచన ఏమిటంటే పన్ను చెల్లింపు ఆలస్యమైనప్పటికీ ఆ మొత్తాన్ని నగదు ద్వారా కాకుండా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) ద్వారా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించనవసరం లేదని. కానీ, ఇది కొంతవరకే నిజం. ఈ అవగాహన లోపంతో చాలా మందొ పొరపాట్లు చేస్తున్నారు. ఇలాంటి వారికి వడ్డీ చెల్లించమని నోటీసులు వస్తున్నాయి. అసలు ఈ విషయాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో చూద్దాం.

ఇంతకు ముందు ఉన్న విధానంతో పోలిస్తే జీఎ్‌సటీలో రిటర్న్‌ దాఖలు చేసే పద్ధతి కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే ఆ నెలకు చెల్లించాల్సిన మొత్తం చెల్లిస్తే గానీ రిటర్న్‌ దాఖలు కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.50,000 పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.40,000 ఐటీసీ ఉందనుకుందాం. అంటే మిగతా రూ.10,000 నగదు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కానీ, సమయానికి రూ.10,000 లభించక రిటర్న్‌ వాయిదా పడింది. ఒక నాలుగు నెలల తర్వాత తనకు నగదు సర్దుబాటు అయిన తర్వాత మొత్తం రూ.50,000తో రిటర్న్‌ దాఖలు చేశాడు, సకాలంలో రిటర్న్‌ దాఖలు చేయనందుకు తాను లేట్‌ ఫీజు కూడా చెల్లించాడు. అయితే ప్రభుత్వానికి సకాలంలో పన్ను చెల్లించలేదు కాబట్టి పన్ను చెల్లించాల్సిన తేదీ నుంచి చెల్లింపు జరిగిన తేదీ వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ వడ్డీ ఎంత మీద చెల్లించాలనే దాని మీద మొదట్లో కొంత గందరగోళం ఉండేది. చెల్లించాల్సిన మొత్తం రూ.50,000 కాబట్టి ఆ మొత్తం మీద వడ్డీ చెల్లించాలి అని ఒక వాదన కాగా, రూ.40,000 సదరు వ్యక్తికి ఐటీసీ రూపంలో నిర్ణీత గడువు నాటికే అందుబాటులో ఉంది కాబట్టి నగదు రూపంలో చెల్లించిన రూ.10,000 మీద మాత్రమే వడ్డీ వర్తిస్తుందని మరొక వాదన. మొత్తానికి దీనికి సంబంధించి ప్రభుత్వం కొంత వివరణ ఇచ్చింది. సంబంధిత సెక్షన్‌ను సవరించింది. దీని ప్రకారం రిటర్న్‌ ఆలస్యంగా దాఖలు చేసిన సందర్భంలో ఐటీసీ ద్వారా చెల్లించిన పన్ను మేరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే నగదు ద్వారా చెల్లించిన పన్నుకు మాత్రమే వడ్డీ వర్తిస్తుంది. పై ఉదాహరణలో రూ.40,000 ఐటీసీ ద్వారా చెల్లించటం జరిగింది కాబట్టి దాని మీద వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.10,000 మీద మాత్రమే వడ్డీ చెల్లించాలి.


కానీ ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. రిటర్న్‌ దాఖలు చేయటం ఆలస్యమైనప్పటికీ ఆ రిటర్న్‌ పీరియడ్‌కు సంబంధించిన వివరాలు అన్ని ఆ రిటర్న్‌లో కచ్చితంగా చూపాలి. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు జనవరి నెలలో రూ.లక్ష అమ్మకాలు జరిపాడు. దానికి గాను రూ.12,000 పన్ను చెల్లించాలనుకుందాం. ఈ రూ.12,000 కు గాను తన దగ్గర రూ.14,000 ఐటీసీ ఉంది. పన్ను చెల్లింపు మొత్తానికి ఐటీసీ సరిపోతుంది కాబట్టి నగదులో ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు. అయితే జనవరి నెల రిటర్న్‌ ఏదో కారణంతో సకాలంలో ఫైల్‌ చేయకుండా ఒక రెండు నెలల తర్వాత వేసాడనుకుందాం. అయినప్పటికీ, ఆ రిటర్న్‌లో జనవరిలో జరిపిన రూ.లక్ష అమ్మకాలు మొత్తం చూపి, దానికి సంబంధించిన పన్నును నగదు ఉపయోగించకుండా ఐటీసీ ద్వారా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ కట్టనవసరం లేదు. అలాకాకుండా అదే జనవరి రిటర్న్‌ సకాలంలో దాఖలు చేసి రూ.లక్షకు గాను రూ.60,000 అమ్మకాలు మాత్రమే చూపి మిగతా రూ.40,000 అమ్మకాలు ఫిబ్రవరి నెల రిటర్న్‌లో కలిపి చూపితే ఐటీసీ సరిపోను ఉన్నప్పటికీ వడ్డీ మినహాయింపు రాదు.

ఎందుకుంటే రూ.40,000 జనవరికి సంబంధించినవి కాబట్టి. అంటే పన్ను చెల్లింపు ఆలస్యమైనప్పటికీ సంబంధిత రిటర్న్‌ ఏ పీరియడ్‌కు అయితే దాఖలు చేస్తున్నారో, ఆ పీరియడ్‌లో జరిపిన సరఫరాల వివరాలు అన్నీ చూపి తగిన పన్ను చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు మాత్రమే ఐటీసీ ద్వారా జరిపిన చెల్లింపునకు వడ్డీ మినహాయింపు లభిస్తుంది. ఇంకొక షరతు ఏమిటంటే, రిటర్న్‌ దాఖలు చేయటమనేది అధికారులు చర్యలు తీసుకోవటానికి పూర్వమే జరిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ వడ్డీ మినహాయింపు లభిస్తుంది.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 04:07 AM