Rs500 Notes Ban: 2026 మార్చి నాటికి రూ.500 నోట్లు రద్దు.. నిజమెంత?
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:44 PM
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. దానిలో 2026 మార్చి నాటికి రూ.500 నోట్లు రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది తెలిసిన సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది నిజమేనా, కాదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సాప్‌లో గత రెండు రోజులుగా ఓ విషయం వైరల్ అవుతోంది. ఆ మెసేజ్ ప్రకారం చూస్తే.. 2026 మార్చి నాటికి రూ.500 నోట్లు రద్దు (Rs500 Notes Ban) అవుతాయని ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ నోట్లను వాడుకోవాలని అంటున్నారు. ఇది తెలిసిన సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ వార్తలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. రూ.500 నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయని PIB వెల్లడించింది.
వైరల్ అవుతున్న వార్తలో..
వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వార్త ఇలా ఉంది. RBI ఆదేశాల మేరకు 2025 సెప్టెంబర్ 30 నాటికి అన్ని బ్యాంకులు ATMల నుంచి రూ.500 నోట్లను పంపిణీ చేయడం ఆపేయాలి. 2026 మార్చి 31 నాటికి 75% ATMలు, ఆ తర్వాత 90% ATMలు రూ.500 నోట్లను పంపిణీ చేయవు. ఇకపై ATMల నుంచి రూ.200, రూ.100 నోట్లు మాత్రమే లభిస్తాయి. కాబట్టి, మీ వద్ద ఉన్న రూ.500 నోట్లను ఇప్పటి నుంచే ఖర్చు చేయడం లేదా మార్చుకోవడం ప్రారంభించాలని ఉంది. ఇది చూసినవారు రూ.500 నోట్లు త్వరలో చెల్లవని, వాటిని వెంటనే ఖర్చు చేయాలని ఆందోళన చెందారు.
గందరగోళం నేపథ్యంలో
నెట్టింట వైరల్ అవుతున్న ఈ విషయంపై గందరగోళాన్ని తొలగించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ చేసి PIB ఇలా తెలిపింది. RBI 2025 సెప్టెంబర్ నాటికి ATMల నుంచి రూ.500 నోట్లను ఆపమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. రూ.500 నోట్ల లావాదేవీలు చెల్లుబాటులో ఉంటాయని చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మెుద్దని సూచించింది.
ఈ గందరగోళం ఎలా మొదలైంది?
ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఏప్రిల్‌లో RBI విడుదల చేసిన ఒక సర్క్యులర్ అని చెబుతున్నారు. ఈ సర్క్యులర్‌లో బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు (WLAOs) ATMలలో రూ.100, రూ.200 వంటి చిన్న నోట్ల లభ్యతను మెరుగుపరచాలని RBI కోరింది. ఈ సర్క్యులర్ రూ.500 నోట్లను రద్దు చేయమని లేదా వాటి పంపిణీని ఆపమని చెప్పలేదు. కానీ, ఈ సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుని, కొందరు రూ.500 నోట్లు రద్దవుతాయని తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి