Exporters Support: ఎగుమతిదారులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:49 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో దెబ్బతిన్న ఎగుమతి కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గురువారం తనను కలిసిన భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఫియో) జాతీయ...
రూ.25,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ !
హమీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో దెబ్బతిన్న ఎగుమతి కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గురువారం తనను కలిసిన భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఫియో) జాతీయ అధ్యక్షుడు ఎస్‌సీ రల్హాన్ నాయకత్వంలోని ఎగుమతిదారుల బృందానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు హమీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో మీకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు సీతారామన్ చెప్పినట్టు ఫియో ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం ఆరేళ్ల పాటు అమల్లో ఉండేలా రూ.25,000 కోట్ల నిధితో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం) పేరుతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి.
సాయం ఇలా!
ఎగుమతుల కోసం ఈ కంపెనీలు తీసుకున్న రుణ వసూళ్లపై విరామం (మారటోరియం) ప్రకటించే విషయాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటికి తోడు అమెరికా సుంకాల పోటును దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాల మార్కెట్లపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారత్-బ్రిటన్ ఎఫ్‌టీఏ తరహాలో ఈయూ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌లతోనూ ఎఫ్‌టీఏలు కుదుర్చుకునేందుకు చర్చలను త్వరితం చేస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. మరోవైపు జీఎస్‌టీ సంస్కరణల ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచి ఈ కంపెనీలకు అండగా నిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఎంఎ్‌సఎంఈల కోసం..
అమెరికా సుంకాల పోటుతో ఎగుమతుల రంగంలో ఉన్న ఎంఎ్‌సఎంఈ కంపెనీలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఈ కంపెనీలను ఆదుకునేందుకు అవి తీసుకునే రుణ చెల్లింపుల కోసం అత్యవసరంగా ప్రత్యేక రుణ చెల్లింపుల హామీ పథకం తీసుకువచ్చేందుకూ కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. అమెరికా ఆంక్షల ప్రభావం పెద్ద పెద్ద కంపెనీలపై కంటే అన్ లిస్టెడ్ కంపెనీలు, ఎంఎ్‌సఎంఈలపైనే ఎక్కువగా ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. దీనికి తోడు ఈ కంపెనీల్లోనే ఎక్కువ మంది పని చేస్తున్నారు. దీంతో కొవిడ్ సమయంలోలా ఈ కంపెనీలకు ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి