Purest Gold Producing Countries: స్వచ్ఛమైన బంగారం కావాలంటే.. ఈ దేశాలకు వెళ్లాల్సిందే..
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:09 PM
బంగారం కొనుగోలు చేసే సమయంలో... బంగారం స్వచ్ఛతపై కొనుగోలుదారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. అయితే ప్రపంచంలో ఏ దేశమూ 100 శాతం స్వచ్చమై బంగారాన్ని ఉత్పత్తి చేయలేదు.
బంగారం ధర.. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించిన రాకెట్‌లా దూసుకుపోతుంది. నిన్నటి ధర నేడు. నేటి ధర రేపు.. రేపటి ధర ఎల్లుండి ఉండని పరిస్థితి నెలకొంది. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. లక్షన్నర దాటిపోయింది. మరికొద్ది రోజుల్లో ఈ 10 గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. పుత్తడి ధర ఆకాశాన్ని తాకుతున్న.. బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
బంగారం కొనుగోలు చేసే సమయంలో... బంగారం స్వచ్ఛతపై కొనుగోలుదారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. అయితే ప్రపంచంలో ఏ దేశమూ 100 శాతం స్వచ్చమై బంగారాన్ని ఉత్పత్తి చేయలేదు. ఎందుకంటే లోహం సహజంగా మృదువైన ఆకృతిని కలిగి ఉంటుంది. అందువల్ల బంగారం పూర్తి స్వచ్ఛతను సాధించడం దాదాపుగా అసాధ్యమే అవుతుంది. కానీ స్వచమైన అంటే.. 999.99 స్వచ్ఛమైన బంగారాన్ని ఆరు దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆయా దేశాలు..
చైనా..
ప్రపంచంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న దేశం ఏదైనా ఉందంటే.. అది చైనానే. ఈ దేశంలో అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీ ఉంది. నాణ్యమైన బంగారం ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశంలో బంగారాన్ని అత్యాధునిక పద్దతిలో శుద్ది చేస్తున్నారు. దీని స్వచ్ఛతను ప్రభుత్వ, ప్రైవేట్ మెంట్‌లు నిర్థారిస్తాయి. ఈ దేశంలో గోల్డ్ మార్కెట్ చాలా ప్రభావంతంగా పని చేస్తుంది. బంగారం నాణ్యతతోపాటు పరిమాణంపై సైతం చైనా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
స్విట్జర్లాండ్..
అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని శుద్ది చేయడంలో స్విట్జర్లాండ్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ శుద్ది చేసిన బంగారం 99.99 శాతం స్వచ్ఛతను కలిగి ఉంటుంది. ఈ దేశంలో సొంత బంగారు గనులు లేకున్నా.. దిగుమతి అయిన పుత్తడిని అత్యున్నత ప్రమాణాలతో శుద్ది చేస్తుంది. వాటిని బార్‌లుగా మలచి తిరిగి ఎగుమతి చేస్తాయి. దీంతో స్విస్ బంగారాన్ని అంతర్జాతీయ స్వచ్ఛత, శ్రేష్టతకు ప్రమాణికంగా తీసుకుంటారు.
కెనడా..
ఈ దేశంలోని పశ్చిమ ప్రాంతంలో బంగారు గనులు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడి శుద్ధయ్యే బంగారం.. ముఖ్యంగా రాయల్ కెనెడియన్ మింట్ నుంచి వస్తోంది. దీని స్వచ్ఛతపై నమ్మకంతో ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ శుద్ధయిన బంగారమని ప్రభుత్వం ధృవీకరిస్తుంది. కెనడాలోని ఖనిజ నిబంధనలు అత్యంత కఠినంగా అమలవుతాయి. దీంతో ఈ దేశపు బంగారానికి ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన, నాణ్యమైన ప్రమాణాలను కలిగి ఉందని అంతా విశ్వసిస్తారు.
ఆస్ట్రేలియా..
ఈ దేశంలో బంగారం నాణ్యత, స్వచ్ఛతపై కఠిన నియమ నిబంధనలు అమలవుతున్నాయి. పెర్త్‌లోని మింట్ ద్వారా అధిక నాణ్యత గల బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. అందుకే ఆస్ట్రేలియాలోని బులియన్, కాయిన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా మదుపుదారులు ఆసక్తి కనబరుస్తారు. పరిమాణంతోపాటు నాణ్యత కలిగిన బంగారం లభ్యం కావడంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవడమే కాకుండా.. ఆ స్థానాన్ని పదిలం చేసుకొంటూ వస్తోంది.
యునైటెడ్ స్టేట్స్..
ప్రపంచంలో భారీగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి. ప్రత్యేకించి నెవాడ స్థానంగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తారు. ప్రభుత్వమే ఈ బులియన్స్, కాయిన్స్‌ను జారీ చేస్తుంది. దీంతో దీనికి విశ్వసనీయత అధికం. అమెరికాలో బంగారం ఉత్పత్తులు స్వచ్ఛతపై అందరికి తరగని విశ్వాసం ఉంది. యూఎస్‌లోని మింట్‌ల నుంచి శుద్దవుతున్న బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.
రష్యా..
బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా ఒకటి. సైబిరియాతోపాటు ఆ దేశ తూర్పు ప్రాంతంలో భారీ ఎత్తున మైనింగ్ ఆపరేషన్స్ చేపట్టింది. ఈ దేశంలోని మింట్లు.. ప్రపంచ ప్రమాణాలకు కట్టుబడి పని చేస్తున్నాయి. దీంతో ఈ దేశం నుంచి భారీ ఎత్తున బంగారం విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ ఎగుమతి అయిన బంగారం.. అంతర్జాతీయ లోహాల మార్కెట్‌లో కీలక భూమిక పోషిస్తుంది. రష్యా.. నాణ్యమైన బంగారం సరఫరా చేస్తుంది. అంతే కాకుండా అత్యంత నాణ్యమైన బంగారాన్ని ప్రాసెసింగ్ చేసే సౌకర్యాలను సైతం ఈ దేశం కలిగి ఉంది.
ఇవీ చదవండి:
Investors Wealth: రూ 2 లక్షల 71 కోట్ల సంపద నష్టం
మార్కెట్లో హ్యుండయ్ సరికొత్త వెన్యూ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి