Share News

Bullion Market Record Highs: బులియన్‌ మార్కెట్లో రికార్డుల మోత

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:22 AM

బులియన్‌ మార్కెట్‌ పరుగెడుతోంది. బంగారం, వెండి ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్‌) బంగారం ధర రూ.1,800 పెరిగి రూ.1,15,100కు చేరి సరికొత్త రికార్డు....

Bullion Market Record Highs: బులియన్‌ మార్కెట్లో రికార్డుల మోత

ఆల్‌టైమ్‌ హైలో పసిడి, వెండి ధరలు

ఢిల్లీలో ఒక్కరోజే రూ.1,800 పెరుగుదల. రూ.1,15,100 చేరిక

  • కిలో వెండి రూ.1,32,870 స్థాయికి

  • రానున్న రోజుల్లో మరింత ముందుకే

  • త్వరలో రూ.1.34 లక్షల స్థాయికి పసిడి ధర!

  • సన్నగిల్లుతున్న దిద్దుబాటు ఆశలు

న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్‌ పరుగెడుతోంది. బంగారం, వెండి ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్‌) బంగారం ధర రూ.1,800 పెరిగి రూ.1,15,100కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో వెండి ధర రూ.570 లాభంతో రూ.1,32,870కు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ర్యాలీ ఇలానే కొనసాగితే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర త్వరలోనే రూ,1.34 లక్షలకు చేరుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ మంగళవారం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 3,698.86 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఔన్స్‌ వెండి ధరా 42.85 డాలర్లకు చేరువైంది. వెండి ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదిసారి.

ఫ్యూచర్స్‌’లోనూ అదే ట్రెండ్‌

ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు మంగళవారం రికార్డు స్థాయిని తాకాయి. డిసెంబరులో డెలివరీ ఇచ్చే ఔన్స్‌ పసిడి ధర మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో 3,736.97 డాలర్ల వద్ద ట్రేడైంది. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. ఎంసీఎక్స్‌లో వచ్చే నెల డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.384 లాభంతో రూ.1,10,563కి చేరింది. ఇది సరికొత్త రికార్డు స్థాయి. డిసెంబరులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల పసిడి ధర రూ.418 లాభంతో రూ.1,11,665 రికార్డు స్థాయిని తాకింది.


ర్యాలీకి కారణాలు

  • అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు

  • డాలర్‌తో క్షీణిస్తున్న రూపాయి మారకం రేటు

  • పెద్దఎత్తున పసిడి కొంటున్న కేంద్ర బ్యాంకులు

  • ప్రధాన కరెన్సీలతో క్షీణిస్తున్న అమెరికా డాలర్‌ మారకం రేటు

  • ప్రభుత్వ రుణ పత్రాలపై కంటే పసిడిపై అధిక రాబడులు

  • క్లిష్ట సమయాల్లోనూ సురక్షిత పెట్టుబడిగా పసిడికి ఉన్న పేరు

  • అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి

  • పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు

బంపర్‌ లాభాలు

స్టాక్‌ మార్కెట్‌తో పోలిస్తే గత ఏడాది కాలంలో బంగారం, వెండి మదుపరులకు మంచి లాభాలు పంచాయి. గత 12 నెలల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపుగా ఎదుగూ బొదుగు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఇదే సమయంలో పసిడిలో పెట్టుబడులు 52 శాతం, వెండిలో పెట్టుబడులు 50 శాతం లాభాలు పంచాయి. దీంతో గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడులకు పెద్దగా నష్టం లేకుండా స్థిరమైన రాబడులను ఆశించే మదుపరులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డెట్‌ ఫండ్స్‌కు గుడ్‌బై చెప్పి గోల్డ్‌ ఈటీఎ్‌ఫలను ఆశ్రయిస్తున్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మారిన ఈ ట్రెండ్‌తో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫర్‌ చేసే మల్టీ అసెట్‌ ఫండ్స్‌కు గిరాకీ పెరిగింది.


ఎందాక ఈ పరుగు?

నిన్న మొన్నటి వరకు 3,500 డాలర్ల వద్ద పసిడి పరుగుకు బ్రేక్‌ పడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావించాయి. ప్రస్తుత ర్యాలీని చూస్తుంటే ఈ ఏడాది చివరికల్లా ఔన్స్‌ (31.10 గ్రాములు) పసిడి ధర 4,000 డాలర్లకు (సుమారు రూ.3,52,360) చేరుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అయితే మార్కెట్‌ ఇప్పటికే ఓవర్‌ బాట్‌ స్థాయికి వెళ్లటంతో 5 నుంచి 6 శాతం వరకు దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం కూడా ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటి దిద్దుబాటు వచ్చినా, అది తాత్కాలికమేనని, వచ్చే ఏడాది ఔన్స్‌ పసిడి ధర 4,200 డాలర్లకు చేరే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ విశ్వసనీయత దెబ్బతింటే ఔన్స్‌ పసిడి ధర 5,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఈ నెల తొలి వారంలో విడుదల చేసిన ఒక నివేదికలో హెచ్చరించింది.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 05:23 AM