India GDP growth 2025: ఈ ఏడాది వృద్ధి 6.9 శాతం
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:33 AM
అంతర్జాతీయ పరపతి రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాను గతంలో ప్రకటించిన 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. ఈ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో...
అంచనాలను పెంచిన ఫిచ్.. దేశీయ డిమాండ్ వృద్ధికి చోదకం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరపతి రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాను గతంలో ప్రకటించిన 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. ఈ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బలమైన వృద్ధి నమోదవడంతో పాటు దేశీయంగా వినియోగం భారీగా పుంజుకోనుండటం ఇందుకు కారణంగా పేర్కొంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ట్రంప్ సుంకాల నేపథ్యంలో పలు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, బహుళజాతి ఆర్థిక సంస్థలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ వచ్చాయి. ఇలాంటి ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోనూ వృద్ధి అంచనాలను పెంచిన తొలి అంతర్జాతీయ ఏజెన్సీ ఫిచ్. పైగా అన్ని ఏజెన్సీల్లోకెల్లా అత్యధిక వృద్ధిని అంచనా వేసింది కూడా ఇదే. దేశీయంగా వినియోగం భారీగా పెరగడంతో పాటు ట్రంప్ సుంకాల ప్రభావం నుంచి బయటపడేందుకు జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు దోహదపడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలకుగాను ఫిచ్ విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలోని మరిన్ని విషయాలు..
ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 6.7 శాతం వృద్ధిని అంచనా వేయగా.. 7.8 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది.
గడిచిన కొన్ని నెలల్లో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య అనిశ్చితి పెరిగింది. భారత్‌పై తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. ఆగస్టు 27 నుంచి 50 శాతానికి పెంచారు. భవిష్యత్‌లో ఈ సుంకం మళ్లీ దిగిరావచ్చని భావిస్తున్నాం. కానీ, అమెరికాతో వాణిజ్య సంబంధాలపై నెలకొన్న అనిశ్చితి వ్యాపార సెంటిమెంట్, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్న జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినియోగం పెరిగేందుకు దోహదపడనుంది. దేశీయ డిమాండే వృద్ధికి ప్రధాన చోదకం. బలమైన గృహ ఆదాయం వినియోగానికి, సులభమైన ఆర్థిక పరిస్థితులు పెట్టుబడులకు ఊతమివ్వనున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మాత్రం వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు. 2026-27లో వృద్ధిరేటు 6.3 శాతంగా, 2027-28 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా నమోదు కావచ్చని అంచనా.
ఈ సారి మెరుగైన వర్షపాతం నమోదవడంతో పాటు అధిక స్థాయిలో ఆహార నిల్వలున్న నేపథ్యంలో ధరల సూచీ అదుపులోనే ఉండనుంది. ఈ ఏడాది చివరినాటికి వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.2 శాతంగా, 2026 చివరినాటికి 4.1 శాతంగా నమోదు కావచ్చని అంచనా.
ఈ ఏడాది చివర్లో ఆర్‌బీఐ రెపోరేటును మరో 0.25 శాతం తగ్గించవచ్చు. వచ్చే ఏడాదిలో మాత్రం రెపో యథాతథంగా కొనసాగవచ్చు. ఆర్‌బీఐ 2027లో రెపోరేటును మళ్లీ పెంచేందుకు అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News