Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా.. ఈ పొరపాట్లు మీ డబ్బుని దోచేస్తాయ్..
ABN , Publish Date - Jul 09 , 2025 | 09:29 PM
ఇటీవల కాలంలో భారత్‌లో డిజిటల్ చెల్లింపులు (Digital Payments) వేగంగా విస్తరిస్తున్నాయి. క్యూఆర్ కోడ్లు, యూపీఐ వంటి సౌకర్యాలతో రోజువారీ లావాదేవీలు మరింత సులభంగా మారాయి. కానీ ఇలాంటి సమయంలో డిజిటల్ చెల్లింపుల మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఇటీవల కాలంలో రోజువారీ డిజిటల్ చెల్లింపులు (Digital Payments) క్రమంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం చెల్లింపుల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్‌మెంట్ వ్యవస్థలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు పాటించడం ద్వారా మీ లావాదేవీలను సురక్షితంగా చేసుకోవచ్చని అంటున్నారు.
1. చెల్లింపు చేయడానికి ముందు తనిఖీ
డిజిటల్ చెల్లింపు చేసే ముందు, స్క్రీన్‌పై కనిపించే పేరును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి. మీరు చెల్లింపు చేయాలనుకున్న వ్యక్తి లేదా వ్యాపార సంస్థ పేరు సరిగ్గా ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని కంపెనీలు లేదా షాపులకు వేరే స్టిక్కర్లు అంటించి మోసాలు చేసిన అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
2. విశ్వసనీయ యాప్, వెబ్‌సైట్‌లు
చెల్లింపుల కోసం ఎల్లప్పుడూ అధికారిక, పేరున్న యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను మాత్రమే వినియోగించండి. తెలియని వ్యక్తులు, ఇతర సంస్థల నుంచి వచ్చిన లింక్‌లపై క్లిక్ చేయడం లేదా యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు మోసపోయే అవకాశముంది. ఉదాహరణకు Google Pay, PhonePe, Paytm వంటి గుర్తించిన యాప్‌లను మాత్రమే ఉపయోగించండి.
3. మీ PIN లేదా OTP
మీ UPI PIN, OTP లేదా బ్యాంక్ వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుకోవాలి. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ అధికారి, పోలీసు లేదా ప్రభుత్వ అధికారి అని చెప్పి వివరాలను అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. అలాంటి వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
4. తొందరపడి చెల్లింపులు
ఎవరైనా మిమ్మల్ని త్వరగా చెల్లింపు చేయమని లేదా వివరాలు పంచుకోమని అడిగితే, ఒక్క క్షణం ఆలోచించండి. ఫోన్ చేసిన వారు ఎవరు, ఏంటని తెలుసుకున్న తర్వాత మాత్రమే చెల్లింపుల విషయంలో నిర్ణయం తీసుకోండి. తొందరపడి లావాదేవీలు వెంటనే చేస్తే నష్టపోయే అవకాశముంది.
5. చెల్లింపు నోటిఫికేషన్
మీ చెల్లింపుల కోసం SMS, యాప్ నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి. ప్రతి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. ఏదైనా అసాధారణ లావాదేవీ కనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్ లేదా చెల్లింపు యాప్‌ను సంప్రదించండి. ఉదాహరణకు మీ ఖాతా నుంచి అనధికారికంగా డబ్బు డెబిట్ అయినట్లు నోటిఫికేషన్ వస్తే వెంటనే స్పందించండి.
అనుమానాస్పద కార్యకలాపాల రిపోర్ట్
ఇలాంటి క్రమంలో ఏదైనా అనుమానాస్పద మెసేజ్ వస్తే, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు డయల్ చేయండి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వెబ్‌సైట్ (https://sancharsaathi.gov.in/sfc/) ద్వారా ఫిర్యాదు చేయండి. అనుమానాస్పదంగా అనిపిచిన వాటిని సేవ్ చేయండి, స్క్రీన్‌షాట్‌లు తీసుకోండి. సంబంధిత సమాచారం ఫిర్యాదు చేయడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి