Share News

Adani Group: సెబీ క్లీన్ చిట్.. చుక్కల్ని తాకిన అదానీ షేర్లు, రూ.66,000 కోట్లు పెరిగిన అదానీ మార్కెట్ క్యాప్‌

ABN , Publish Date - Sep 19 , 2025 | 07:35 PM

అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ క్లియర్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.

Adani Group: సెబీ క్లీన్ చిట్.. చుక్కల్ని తాకిన అదానీ షేర్లు, రూ.66,000 కోట్లు పెరిగిన అదానీ మార్కెట్ క్యాప్‌
Adani Group

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ షేర్లు ఇవాళ(శుక్రవారం) చుక్కల్ని తాకాయి. ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు. అదానీ గ్రూప్ కు చెందిన అన్ని షేర్లూ భారీగా పెరిగాయి. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్‌లో రూ.66,000 కోట్లు పెరిగింది. భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' అదానీతోపాటుగా అదానీ గ్రూప్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది.

కాగా, గతేడాది అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్.. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారని.. ఇన్‌సైడర్ ట్రేడింగ్, మార్కెట్ అవకతవకలు, పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపణలు గుప్పించింది. దీంతో అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కంపెనీ లక్షల కోట్ల రూపాయల విలువను కోల్పోయింది.


అయితే, తాజాగా విస్తృత స్థాయి దర్యాప్తు అనంతరం సెబీ, అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. హిండెన్ బర్గ్ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లభించలేదని, అదానీ గ్రూప్ తమ కంపెనీల నిధులను ఇతర సంస్థల ద్వారా మళ్లించి పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలకూ ఎలాంటి సాక్ష్యం దొరకలేదని సెబీ తేల్చి చెప్పింది.

అంతేకాదు, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు రాజేశ్ అదానీ, గ్రూప్ సీఎఫ్‌వో జుగీషిందర్ సింగ్ తదితరులు ఎటువంటి తప్పూ చేయలేదంది. దీంతో మార్కెట్లో అదానీ షేర్లు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి.

తాజా పరిణామంపై గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదికలో ఉన్న ఆరోపణలు నిజం కావని తాను మొదటే చెప్పానని అదానీ అన్నారు. అవి ఉద్దేశపూర్వకంగా పెట్టుబడిదారులలో భయం, అనుమానం కలిగించేలా రాసినవని చెప్పారు. అలాంటి తప్పుడు కథనాలను నమ్మి దేశ ఆర్థిక ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేసినవారు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని సడలించినవారు ఇప్పుడు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 08:48 PM