Adani: రక్షణ రంగంలో అదానీ గ్రూప్ రూ.1.8 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:36 AM
అదానీ గ్రూప్ భారత రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మానవరహిత అటానమస్ వ్యవస్థలు.. ఏఐ ఆధారిత కార్యకలాపాలు, విమాన ఇంజిన్ల నిర్వహణ-మరమ్మతు-ఓవర్‌హాలింగ్..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 29: అదానీ గ్రూప్ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భారీ పెట్టుబడులు పెట్టనుంది. రక్షణ ఉత్పత్తుల తయారీలో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని గ్రూప్ యోచిస్తోందని సమాచారం. మానవరహిత అటానమస్ వ్యవస్థలు (యూఏవీలు), అడ్వాన్స్డ్ గైడెడ్ ఆయుధాలు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీపై ఈ సంస్థ ప్రధాన దృష్టి సారించనుంది.
అలాగే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కార్యకలాపాలు, విమాన ఇంజిన్ల నిర్వహణ-మరమ్మతు-ఓవర్‌హాలింగ్ (ఎంఆర్‌ఓ), శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై పనిచేయనుంది. అటానమస్ వ్యవస్థల వల్ల యుద్ధాల్లో సైనికుల ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చనేది అదానీ గ్రూప్ ఆలోచన.
ఈ ఏడాది గ్రూప్ రూపొందించిన 'ద్రిష్టి-10' యూఏవీలు ఇప్పటికే భారత నౌకాదళంలో చేరాయి. ఇవి నిఘా, పరిశీలన, ప్రత్యర్థి కదలికలను గుర్తించడంలో ఉపయోగపడుతున్నాయి.
అదానీ తయారు చేసిన ప్రత్యర్థి డ్రోన్లను పసిగట్టే వ్యవస్థలపై రక్షణ బలగాల పరీక్షలు పూర్తయ్యాయి. 2026లో అటానమస్ వ్యవస్థల ఉత్పత్తిని మరింత పెంచనుంది. ఈ పెట్టుబడులతో భారత్ రక్షణ రంగంలో స్వావలంబన (ఆత్మనిర్భర్ భారత్) లక్ష్యానికి దగ్గరవుతుందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి! ఏకంగా..
వామ్మో.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు