Share News

Tadepalli Politics: నాడు.. నేడు అదే క్యూ

ABN , Publish Date - May 18 , 2025 | 04:25 AM

మద్యం కుంభకోణంలో అరెస్టైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను కలిసేందుకు వైసీపీ నేతలు కోర్టు వద్ద భారీగా చేరుకున్నారు. వారిద్దరిని జైలు తరలించే వరకూ పలువురు నేతలు అక్కడే ఉండిపోయారు.

Tadepalli Politics: నాడు.. నేడు అదే క్యూ

  • ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను కలిసేందుకు భారీగా వైసీపీ నేతలు

  • ఏసీబీ కోర్టు హాలు నిండా వాళ్లే

  • వారిద్దరిని జైలుకు తరలించే వరకు అక్కడే..

  • నల్లకోటు ధరించిన చెవిరెడ్డి, గౌతంరెడ్డి

విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి): ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి... ఈ ఇద్దరి దర్శనం కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు తాడేపల్లిలోని జగన్‌ ఇంటి వద్ద క్యూ కట్టేవారు. ఆ ఇద్దరిని ఇప్పుడు మద్యం కుంభకోణంలో సిట్‌ అరెస్టు చేసింది. వైసీపీ నేతలు నాటిలాగే ఇప్పుడు కూడా క్యూ కట్టారు. సిట్‌ అధికారులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను విజయవాడ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో విచారించారు. అక్కడికి వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్‌ వచ్చారు. వారిద్దరిని అరెస్టు చేసిన తర్వాత సిట్‌ అధికారులు శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీనికి ముందు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ రెండు చోట్లకు కూడా వైసీపీ నేతలు భారీగా వచ్చారు. వారిని కోర్టుకు తీసుకురాగానే మాజీ మంత్రులు విడదల రజని, వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు రఘురాం, అరుణ్‌కుమార్‌, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌తోపాటు మరికొంతమంది కోర్టు హాలు వద్దకు చేరుకున్నారు. న్యాయాధికారి రావడానికి ముందు నిందితులను కోర్టు హాలు బయట కూర్చోబెట్టారు. అక్కడికి వాళ్లంతా వెళ్లారు. రజని వారిని కలిసి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు.


తలశిల, మల్లాది, అవినాశ్‌, అప్పిరెడ్డి మాత్రం వారికి రిమాండ్‌ విధించిన తర్వాత జైలుకు తరలించే వరకు ఉన్నారు. చివరి నిమిషంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ వచ్చారు. మద్యం కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్టయ్యారు. మిగతా వారిని కోర్టులో హాజరుపరిచినప్పుడు రాని ఈ వైసీపీ నేతలంతా ఇప్పుడు రావడంతో వారిద్దరి హవా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ‘ధనుంజయ్‌రెడ్డి అప్పటి సీఎంఓలో ఉన్నప్పుడు కలవడానికి ఈ విధంగానే గంటల కొద్దీ కుర్చీల్లో కూర్చునేవాళ్లం. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది’ అని కోర్టు హాలులో ఓ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, గౌతంరెడ్డి నల్లకోటు ధరించి న్యాయవాదులుగా కోర్టు హాల్లో కూర్చున్నారు.

Updated Date - May 18 , 2025 | 04:26 AM