Share News

YS Sharmila: ఆమెను బయటకు పంపడమే మీ పతనానికి నాంది

ABN , Publish Date - Jun 10 , 2025 | 08:53 PM

ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేస్తే.. అంత బాధపడితే.. మీరు, వైసీపీ, నా రక్త సంబంధం చేసిన విష ప్రచారానికి ఇంకా ఎంత బాధపడి ఉంటానంటూ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

YS Sharmila: ఆమెను బయటకు పంపడమే మీ పతనానికి నాంది
AP PCC Chief YS Sharmila

అమరావతి, జూన్ 10: టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ బిడ్డనైన నాకు లేదు.. ఆ పరిస్థితి రాదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో విలేకర్లతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఆర్కే రోజా చేసి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఎవరు.. ఎవరికి మద్దతు ఇస్తున్నారో రాష్ట్రమంతా తెలుసునని చెప్పారు. ఇన్ని ఏళ్ళు బీజేపీకి వైఎస్ జగన్ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి ఆయన కొడుకు మద్దతు ఇచ్చాడంటూ ఆమె వ్యంగ్యంగా అన్నారు.

ఆ క్రమంలో ప్రధాని మోదీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడుగా మారాడని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు బీజేపీకి జగన్ ఊడిగం చేశారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకు వైఎస్ జగన్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు చెప్పండి రోజా..? ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చారు? అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజాను వైఎస్ షర్మిల సూటిగా నిలదీశారు.


టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి నుంచి విష ప్రచారం విషయంలో బాధపడ్డానన్నది నిజమేనన్నారు. ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేస్తే.. అంత బాధపడితే.. మీరు, వైసీపీ, నా రక్త సంబంధం చేసిన విష ప్రచారానికి ఇంకా ఎంత బాధపడి ఉంటానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకు అక్రమ సంబంధాలు సైతం అంటకట్టారన్నారు. నా రక్త సంబంధమే నా మీద విష ప్రచారం చేసిందని చెప్పారు. నేను వైఎస్ఆర్‌కి పుట్టలేదన్నారంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. వైఎస్ విజయమ్మకు అక్రమ సంతానం అని పేర్కొన్నారన్నారు. ఆ సమయంలో నేను ఎంత బాధపడి ఉంటానోనని తెలిపారు. రక్త సంబంధం, అక్క చెల్లెళ్ల గురించి వైసీపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రక్త సంబంధం గురించి నన్ను అడిగితే నేను చెప్తానన్నారు.


అన్న కష్టాల్లో ఉన్నాడని మాట అడిగి అడగ్గానే 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. నా బిడ్డలను, నా భర్తను కాదనుకొని ఈ పాదయాత్ర చేశానని వివరించారు. ఇది రక్త సంబంధానికి ఉన్న విలువ అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. జగన్ చెయ్యి చాచి ప్రాణం ఇవ్వమని అడిగినా ఇచ్చే దానినన్నారు. జగన్‌ను ఎంత ప్రేమించానో నాకే తెలుసునని తెలిపారు. ఇది రక్త సంబంధానికి ఉన్న విలువ అని పేర్కొన్నారు. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న నాడే మీరు మనిషి జాబితా నుంచి బయట కొచ్చారన్నారు. మీరు మనుషులు కారని పేర్కొన్నారు. మీరు రక్త సంబంధాల గురించి మాట్లాడటానికి సిగ్గుండాలంటూ మండిపడ్డారు.


విజయమ్మను పార్టీ నుంచి వెళ్లగొట్టిన నాడే మీ పతనానికి నాంది పలికిందని చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండంటూ వైసీపీ నేతలకు వైఎస్ షర్మిల హితవు పలికారు. నేను మద్దతు ఇచ్చేది ఆంధ్రా రాష్ట్రం కోసమని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యల మీద ప్రజా పోరాటాలకు నా మద్దతు ఉంటుందని వైఎస్ షర్మిల కుండ బద్దలు కొట్టారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 10:12 PM