Share News

YS Sharmila: ఆ పార్టీతో జగన్‌కు తెర వెనుక సంబంధాలు: వైఎస్ షర్మిల

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:08 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీజేపీతో ఆయన సన్నిహిత సంబంధాలు నేటికి కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

YS Sharmila: ఆ పార్టీతో జగన్‌కు తెర వెనుక సంబంధాలు: వైఎస్ షర్మిల
AP PCC Chief YS Sharmila

విశాఖపట్నం, జూన్ 20: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడని ఆరోపించారు. బీజేపీతో వైఎస్ జగన్‌కు తెర వెనుక సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీకి అధినేతగా ఉన్న వైఎస్ జగన్ ఈ విధంగా వైలంట్‌గా వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. నరికేస్తాం.. లాంటి పదాలను వాడడం, సమర్ధించడం ఏంటంటూ వైఎస్ జగన్‌ను ఆమె సూటిగా ప్రశ్నించారు.


వైఎస్ జగన్ ముమ్మాటికి మోదీకి దత్త పుత్రుడేనన్నారు. ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారని.. విభజన హామీలు ఇప్పటికీ అమలు చేయక పోవడంతో ప్రజలు గుండెలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోదీ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి.. ఆ మాట తప్పారంటూ ఆమె మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మోసం చేస్తున్నా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడడం లేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందన్నారు.


పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం సరికాదని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, పోలవరం ప్రాజెక్ట్, రాజధానిని నిర్మించ వలసింది కేంద్రమేనని ఆమె స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మించాల్సిన బాధ్యత కూడా మోదీదే అన్నారు. రాజధానికి అప్పులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లపై ప్రధాని మోదీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధానికి ఈ సందర్భంగా వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.


విశాఖ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు వీటన్నింటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. మోదీ చేస్తున్న అన్యాయాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ఏపీ ప్రజలు పడుతున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆమె సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యోగాంధ్ర అవసరమా? అంటూ ప్రభుత్వాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. మరోవైపు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. పార్టీ బలోపేతంపై సైతం ఈ సందర్భంగా చర్చించామన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ

ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 04:04 PM