YS Jagan Rajahmundry Visit Postponed : ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:20 PM
ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.
రాజమండ్రి : ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజమండ్రిలో ఇవాళ బొత్స మీడియాతో మాట్లాడారు. పనిలోపనిగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బొత్స ఫైర్ అయ్యారు. 'రామనామ స్మరణలా ప్రతి విషయానికి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అంటున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు అడ్డుకోవడం లేదు.. 16 సార్లు ఢిల్లీ వెళ్లి సీఎం చంద్రబాబు ఏం సాధించారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు వైసీపీ పోరాటం చేయబోతుంది.' అని బొత్స చెప్పారు.
30వ తేదీన వైజాగ్ జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్ పై పవన్ కళ్యాణ్ ప్రకటన చేయాలని బొత్స డిమాండ్ చేశారు. 'కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ప్రధాని యోగ డే వల్ల విశాఖకు ఏమీ ఉపయోగం జరగలేదు. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఏమయ్యింది? రేషన్ బియ్యం మాఫియా గత ఐదు సంవత్సరాలలో అరకొరగా జరిగితే ఇప్పుడు పదిరెట్లు పెరిగింది. వైజాగ్ లో ఈ మధ్య కాలంలో మూడు సార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి.' అని బొత్స అన్నారు.
సీఎం చంద్రబాబు సింగపూర్ లో పెట్టుబడులు సాధన కోసం కాదు.. పెట్టుబడులు పెట్టుకోడానికి వెళ్లారంటూ బొత్స ఆరోపించారు. పీ4 విధానంలో చంద్రబాబు వైఖరి ట్రంప్ తరహాలో ఉందని బొత్స అన్నారు. ఏపీకి మూడు రాజధానులు సున్నితమైన అంశం అని, మా పార్టీలో మూడు రాజధానులపై చర్చించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. పర్యవేక్షణ లేకపోవడం, ప్రజల పట్ల బాధ్యతరాహిత్యం కారణంగా కూటమి ప్రభుత్వం 16 నెలలుగా వైఫల్యం చెందిందని బొత్స చెప్పుకొచ్చారు.