Share News

Sand Mining Scam: దొరికిన దొంగలు !

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:31 AM

వైఎస్‌ జగన్‌ జమానాలో సాగిన ఇసుక దోపిడీ... ఉపగ్రహ చిత్రాల సాక్షిగా రుజువైంది. తవ్వాల్సింది రవ్వంత... తవ్వుకుని తరలించింది కొండంత అని తేలిపోయింది.

 Sand Mining Scam: దొరికిన దొంగలు !

  • ఉపగ్రహ చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ

  • జగన్‌ జమానాలో విశృంఖలంగా ఇసుక తవ్వకాలు

  • మూడేళ్లలో 3.91 కోట్ల టన్నులు దోచేశారు

  • మొత్తం 794 చోట్ల ఇసుక తవ్వి.. తరలింపు

  • 85 పాయింట్లు మాత్రమే అధికారికం

  • హెక్టారుకు అనుమతిస్తే 40 హెక్టార్లలో ‘స్వాహా’

  • సుప్రీం ఆదేశాలతో రంగంలోకి గనులశాఖ

  • గూగుల్‌ మ్యాప్స్‌, ఉపగ్రహ చిత్రాలతో అధ్యయనం

  • ఏపీఎస్ఏసీ ద్వారా గనుల శాఖ నివేదిక

  • ఇసుక సొమ్ము ఎవరి జేబుల్లోకి చేరినట్లు?

  1. జగన్‌ జమానాలో మూడేళ్లలో 794 పాయింట్లలో 4.11 కోట్ల టన్నుల ఇసుక తవ్వారు. అందులో అనుమతులున్న పాయింట్లు 85 మాత్రమే!

  2. అధికారిక అనుమతులతో తవ్విన ఇసుక 19.69 లక్షల టన్నులు. అనధికారికంగా తవ్వింది 3.91 కోట్ల టన్నులు.

  3. సగటున ఒక హెక్టారులో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తే... 40 హెక్టార్లలో తవ్వేశారు.

  4. అక్రమంగా, చట్టవిరుద్ధంగా, రీచ్‌ల పరిధులు దాటి తవ్వేసి తీసుకెళ్లిన ఇసుక సొమ్ము ఎంత? అది ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఇది సీఐడీ విచారణలోనే తేలాల్సి ఉంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ జగన్‌ జమానాలో సాగిన ఇసుక దోపిడీ... ఉపగ్రహ చిత్రాల సాక్షిగా రుజువైంది. తవ్వాల్సింది రవ్వంత... తవ్వుకుని తరలించింది కొండంత అని తేలిపోయింది. అనుమతించిన రీచ్‌లలో తవ్విన ఇసుక సుమారు 20 లక్షల టన్నులు! కానీ... అనధికారికంగా, అక్రమంగా తవ్వుకున్నది ఏకంగా 3.91 కోట్ల టన్నులు! కళ్లుబైర్లు కమ్మేలా సాగిన విచ్చలవిడి ఇసుక దోపిడీ ఇది! జగన్‌ సర్కారు హయాంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును జేపీ వెంచర్స్‌కు కట్టబెట్టిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత... అసలు సంస్థ తెరవెనక్కు వెళ్లిపోయింది. వైసీపీ పెద్దలే రంగంలోకి దిగి... జిల్లాల వారీగా ఇసుకను తమ నేతలకు కట్టబెట్టారు. 2021లో జేపీ వెంచర్స్‌ తవ్వకాలు మొదలైనప్పుడే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై గుంటూరుకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ఎన్‌జీటీలో కేసులు వేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే అని ఎన్జీటీ నిర్ధారించి... జేపీ వెంచర్స్‌కు కోట్లలో జరిమానా విధించింది.


తీర్పును జేపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. జరిమానా వసూలుపై స్టే విధించినప్పటికీ... కేసు విచారణ కొనసాగుతోంది. జగన్‌ సీఎంగా ఉండగా ఇసుక తవ్వకాలపై గనుల శాఖ అటు ఎన్జీటీ, ఇటు సుప్రీంకోర్టుకు పదేపదే తప్పుడు నివేదికలు ఇచ్చింది.

వాస్తవాలను తవ్వి తీశారు...

కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రమే... అసలు నిజాలు బయటపడ్డాయి. జగన్‌ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, పర్యావరణ ఉల్లంఘన జరిగిందని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టులో ప్రత్యేక అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో అక్ర మ తవ్వకాలపై శాటిలైట్‌ ఇమేజెస్‌ (ఉపగ్రహ చిత్రాలు), గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్స్‌ ఆధారంగా అధ్యయనం చేయాలని సుప్రీం కోర్టు ఏపీ సర్కారును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలు జరిగిన రీచ్‌లపై ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఏపీఎ్‌సఏసీ) ద్వారా గనులశాఖ అధ్యయనం చేయించింది. ఇసుక తవ్వకాలు జరిగిన నదుల పరిధిలోని 794 పాయింట్ల శాటిలైట్‌ చిత్రాలను ఏపీఎ్‌సఏసీ అధ్యయనం చేసింది. ఇందులో... అనుమతించిన రీచ్‌ల పరిధిలో జరిగిన తవ్వకాలు, బయట అక్రమంగా జరిగిన తవ్వకాలు, భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుక మైనింగ్‌ చేసిన నదీతీరాల ఫొటోలను స్పష్టంగా బయటకు తీసింది. మొత్తం 283 శాటిలైట్‌ చిత్రాలను విశ్లేషించి... వాస్తవాలను బయటపెట్టింది.


అంతటా అక్రమ తవ్వకమే...

కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి తదితర నదుల్లో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉపగ్రహ చిత్రాల ద్వారా అధ్యయనం చేశారు. అనుమతించిన రీచ్‌లకు, అక్కడ జరిగిన తవ్వకాలకు అసలు పొంతనే లేదని నిర్ధారించారు. ఒక హెక్టారుకు అనుమతి ఇచ్చిన చోట 40 హెక్టార్ట పరిధిలో తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. కృష్ణా, గోదావరి పరిధిలో... కొన్ని చోట్ల ప్రవాహ దిశలే మారేలా అక్రమ తవ్వకాలు జరిపారు. 2021 నుంచి 2024 మే వరకు... మూడేళ్ల వ్యవధిలో 794 ఇసుక తవ్వకాల పాయింట్లను ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలించారు. వీటిలో 85 మాత్రమే అనుమతించిన, అధికారిక రీచ్‌లు. ఈ పాయింట్ల వద్ద తీసిన ఇసుక 19.69 లక్షల టన్నులు. ఇక, నిబంధనలు ఉల్లంఘించి నదీగర్భాలను కూడా కలిపి తవ్వేసిన పాయింట్లు 709. వీటిల్లో ఏకంగా 3.91 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వి తరలించారు. జగన్‌ పాలనలో ఇసుక అమ్మకాల ద్వారా తొలి రెండేళ్లకు సర్కారుకు రూ.1500 కోట్ల ఆదాయం వచ్చిందని గొప్పగా చెప్పారు. అందులో జేపీ వెంచర్స్‌ ఇంకా 800 కోట్ల బకాయి ఉంది. నిబంధనలకు లోబడి 85 శాండ్‌ పాయింట్లలో తవ్విన ఇసుక సొమ్మును మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చిందనుకుంటే... మరి మిగిలిన 709 పాయిట్లలో తవ్వితీసిన 3.91 కోట్ల టన్నుల ఇసుక ద్వారా వచ్చిన సొమ్ము ఏమైంది? అది ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఇసుక టెండర్లు, అక్రమాలపై ఇటు సీఐడీ, అటు ఏసీబీ విచారణ చేస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణ కోసం గనులశాఖ సమర్పించిన డాక్యుమెంట్‌పై మంగళవారం సీఎం వద్ద చర్చ జరిగినట్లు తెలిసింది.

Untitled-5 copy.jpg

Updated Date - Mar 05 , 2025 | 08:39 AM