kommineni Arrest: అరాచకానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్: వైఎస్ జగన్
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:03 PM
రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.
అమరావతి, జూన్ 09: రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచిన సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందంటూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని అన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాది కాలంగా సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తన దుర్మార్గపు పాలన, మోసాలు, అవినీతి, వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.
తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాకస్థాయికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? అని వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. సహజంగానే డిబేట్‌లో కొందరు వక్తలు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారని గుర్తు చేశారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా?.. అవి ఇప్పటికీ కొనసాగడం లేదా? అని ప్రశ్నించారు.
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదన్నారు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడని ఆరోపించారు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఓ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారని చెప్పుకొచ్చారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు గారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే.. అందులో ఏడాది గడిచిపోయిందని జగన్ అన్నారు. మిగిలిన నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండంటూ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుందని, అది రెండింతలవుతుందని మర్చిపోకండంటూ సీఎం చంద్రబాబును హెచ్చరించే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఇవి కూడా చదవండి
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Read Latest AP News And Telugu News