Janasena MLC Nagababu: మరో 20 ఏళ్ల వరకూ వైసీపీకి అధికారం దక్కదు
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:15 AM
రాష్ట్రంలో ఇంకో ఇరవై ఏళ్ల వరకూ వైసీపీకి అధికారం దక్కదు. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది..
సహనం, ఓర్పుతో ఉన్నవారికే పదవులు
వ్యక్తిగత స్వార్థంతో కూటమిలో విభేదాలు సృష్టించొద్దు
నెలలో ఐదు నుంచి పది రోజులు ఉత్తరాంధ్రలో ఉంటా
కార్యకర్తల సమావేశంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు
విశాఖపట్నం, జూలై 28(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఇంకో ఇరవై ఏళ్ల వరకూ వైసీపీకి అధికారం దక్కదు. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది’ అని జనసేన ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘‘వైసీపీ అనేక కుట్రలు చేస్తోంది. వాటిని తిప్పి కొట్టాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కూటమిలో ఎవరూ చిచ్చు పెట్టవద్దు. అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది మాత్రమే అయింది. అందరికీ పదవులు లభించాలంటే కొంతకాలం ఓపిక పట్టాలి. ఓర్పు ఉన్నవారే గొప్ప నాయకులు అవుతారు. కూటమి మరో 20 ఏళ్లు బలంగా ఉంటుంది. బీజేపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు స్పష్టమైన అవగాహనతో రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. వారికి అండగా ఉండాలి. కులమతాలకు అతీతంగా తీసిన ‘హరిహర వీరమల్లు’ సినిమాపై కూడా వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని తిప్పి కొట్టాలి. వైసీపీయే ప్రధాన శత్రువు. ఆ పార్టీ మీదే పోరాటం చేయాలి. నేను ఉత్తరాంధ్ర ప్రజలకు అందబాటులో ఉంటా. ప్రతి నెలా ఇక్కడకు వచ్చి ఐదు నుంచి పది రోజులు ఉంటా. ప్రతి కార్యకర్తను కలుస్తా. నా ఎమ్మెల్సీ కోటాలో వచ్చే నిధులు ఉత్తరాంధ్ర అభివృద్ధికే ఉపయోగిస్తా’’ అని నాగబాబు అన్నారు. ఈ సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ డీసీసీబీ అధ్యక్షులు కోన తాతారావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..