YCP Sarpanch Corruption Scam: పంచాయతీల్లో దొంగలు పడ్డారు
ABN , Publish Date - Apr 07 , 2025 | 02:57 AM
వైసీపీ హయాంలో పంచాయతీల సొంత ఆదాయాన్ని దారి మళ్లించి సుమారు రూ.100 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. కూటమి ప్రభుత్వానంతరం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ ప్రారంభించారు

వైసీపీకి చెందిన సర్పంచ్‌ల 100 కోట్ల స్వాహాపర్వం
100 పంచాయతీల్లో నిధుల దోపిడీ
సొంత వనరుల సొమ్ము గుట్టుగా జేబుల్లోకి
పనులు చేయకుండానే నిధులు డ్రా
అడ్డగోలుగా దొంగ బిల్లుల సమర్పణ
ఇంటి పన్నుల వసూళ్లలోనూ నొక్కుడు
అధికారుల సహకారంతో అక్రమాలు
కూటమి సర్కారు వచ్చాక ఫిర్యాదులు
దోపిడీపై విచారణ.. కమిషనరేట్‌కు నివేదిక
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, నేతల నుంచి పెద్దల వరకూ ఏ వనరునూ, ఏ ఆదాయ మార్గాన్నీ వదలకుండా దోచుకున్నారు. తామేం తక్కువ తిన్నామా అన్నట్టు మేజర్ పంచాయతీల్లో వైసీపీకి చెందిన చాలామంది సర్పంచ్‌లు దోపిడీ చేశారు. రూ.100 కోట్లకు పైగా నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణలో అక్రమాలు బయట పడుతున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు నిధులివ్వలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించిందని ఓ వైపు సర్పంచ్‌లు పోరాటాలు చేశారు. మరోవైపు మేజర్ పంచాయతీల్లో సొంత వనరుల ద్వారా వచ్చిన నిధులను గుట్టుగా స్వాహా చేసేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి సుమారు రూ.కోటికి పైగా ఆదాయం కలిగిన 100 పంచాయతీల్లో స్కామ్‌కు తెరదీసినట్లు సమాచారం. వైసీపీకి చెందిన సర్పంచ్‌లు సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు దిగమింగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో వారి అవినీతి, అక్రమాలను ప్రశ్నించేందుకు సాహసించలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అవినీతికి పాల్పడిన సర్పంచ్‌లపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేశారు. డీపీఓలు, డీఎల్‌పీఓలు మేజర్ పంచాయతీల్లో జరిగిన దోపిడీపై విచారణ జరిపి పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు నివేదిక పంపారు. వైసీపీకి చెందిన సర్పంచ్‌లు, ఆ పార్టీ నేతల గుప్పిట్లో ఉన్న రిజర్వుడ్ పంచాయతీల్లో అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం.
వైసీపీ హయాంలో కార్యదర్శులను చెప్పుచేతుల్లో పెట్టుకుని సర్పంచ్‌లు భారీగా నిధులు వాడేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంఘం నిధులు అప్పట్లో రాకపోవడంతో ఆయా పంచాయతీలకు వచ్చిన సొంత వనరుల ఆదాయాన్ని లెక్కాపక్కా లేకుండా తినేశారు. పారిశుధ్యం పనులను అడ్డం పెట్టుకుని కూడా భారీగా నిధులు దండుకున్నారు.
నిబంధనలకు పాతర
నిర్మాణ పనుల్లో ఏఈలను అడ్డం పెట్టుకుని ఎంబుక్‌ల్లో రికార్డు చేయకుండానే సర్పంచ్‌లు నిధులు స్వాహా చేశారని చెప్తున్నారు. మీటింగ్‌లు పెట్టకుండానే అజెండాలో లేని పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి దోచుకున్నారు. పంచాయతీల్లో ఏ పనులు చేపట్టాలన్నా వర్క్ కమిటీలు వేయాలి. గత ఐదేళ్లూ రాష్ట్రంలో ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. థర్డ్ పార్టీకి బిల్లులు చెల్లించిన కొందరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్ అయి కార్యాలయాల చుట్టూ, నేతల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీల్లో సివిల్ వర్క్స్ చేసే క్రమంలో వర్క్స్ కమిటీ అగ్రిమెంట్ చేయాలి. అయితే ఆ సంప్రదాయం కూడా ఎప్పుడో నిలిచిపోయింది. పంచాయతీల్లో ఏ వస్తువైనా కొనుగోలు చేయాలంటే వ్యయం రూ.50 వేలు దాటితే టెండర్లు పిలవాలి. కానీ ఎక్కడా టెండర్లు జరిగిన దాఖలాల్లేవు. వార్షిక ఆడిట్‌లో పంచాయతీ ఆడిట్ అధికారులు వాటినేమీ పట్టించుకునే పరిస్థితి లేదు. పర్సంటేజీలు ఇస్తే చాలు ఏదైనా ఒకే చేసే పరిస్థితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సిన జీఎ్‌సటీ కూడా రావడం లేదు. కొన్ని వస్తువులు కొనేటప్పుడు ఎంబుక్ రికార్డు చేసి మరీ ఏఈలు కౌంటర్‌సైన్ చేయాలి. అవేవీ అమలు కావడం లేదు. షాపులకు నేరుగా బిల్లులు చెల్లించాల్సి ఉండగా... థర్డ్ పార్టీలకు బిల్లులు చెల్లిస్తున్నారు.
అడ్డగోలుగా బిల్లులు డ్రా
కొన్ని మేజర్ పంచాయతీలు వైట్ పేపర్ సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్ చేసి మరీ బిల్లులు డ్రా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ట్రెజరీల నుంచి తప్పించి సీఎ్‌ఫఎంఎస్ ద్వారా బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని మేజర్ పంచాయతీల్లో కార్యదర్శులు ఏవేవో బిల్లులు పెట్టి డ్రా చేస్తున్నారు. సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్ చేసే వాటిని తనిఖీ చేసే పరిస్థితి లేకపోవడంతో ఇష్టారీతిగా డబ్బులు డ్రా చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో దొంగ రశీదులిచ్చి మరీ ఇంటి పన్ను వసూలు చేసుకున్నారు. రికార్డుల్లో మాత్రం బకాయిలున్నట్లు చూపిస్తోంది. డబ్బులిచ్చిన వాళ్లకు ఓ రకంగా, ఇవ్వని వాళ్లకు మరో రకంగా ఇంటి పన్నులు నిర్ణయిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమలు నడుపుకొనే వాళ్ల నుంచి ముక్కుపిండి వసూలు చేసుకుంటున్నారు. ఆ పన్నులు పంచాయతీలకు చేరడం లేదు. మ్యుటేషన్ల పేరిట కూడా భారీగా దోచుకుంటున్నారు. వైసీపీ హయాంలో రూ.612 కోట్లు మాత్రమే ఇంటి పన్ను వసూలైంది. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రూ.800 కోట్లకు పైగా పన్నులు వసూలు చేశారు. గతంలో మాదిరి తప్పులు జరగకుండా కమిషనర్ కృష్ణతేజ స్వర్ణ పంచాయతీ పోర్టల్ తీసుకొచ్చి పారదర్శకంగా పన్నుల వసూళ్లు చేపట్టారు.
కార్యదర్శులే బాధ్యులు
నిధుల దోపిడీ వ్యవహారంలో అంతిమంగా పంచాయతీ కార్యదర్శులే బలవుతుండటంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు తటపటాయిస్తున్నారు. 100 మేజర్ పంచాయతీల్లో నిధులు దోచుకున్న సర్పంచ్‌లు.. మరోవైపు గ్రామాభివృద్ధికి సైంధవులుగా మారిపోయారు. పంచాయతీలకు కేంద్రమిచ్చిన ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయకుండా అడ్డుకుంటున్నారు. తమపై ఫిర్యాదులు చేశారని, పనులు చేసినా మళ్లీ ిఫిర్యాదులొస్తాయంటూ పనులు ఆపేసి కూర్చున్నారు. వైసీపీ జడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు కూడా గ్రామాల అభివృద్ధికి సహకరించడం లేదు. స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉండటం, కూటమి సర్కార్ అధికారంలో ఉండటంతో గ్రామాభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయి. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఒకేసారి తీర్మానాలు చేయడంతో సిమెంట్‌రోడ్లు పూర్తయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్