Share News

Anantapur: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడతేర్చింది

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:29 AM

సామాజిక విలువలు, కుటుంబ బంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి.

Anantapur: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడతేర్చింది

  • ఆమెకు ఇద్దరు పిల్లలు.. అతడు అవివాహితుడు

  • ప్రియుడితో హత్య చేయించిన భార్య

  • స్ర్కూడ్రైవర్‌తో పొడిచి.. బండరాయితో మోది హత్య

  • గద్వాల ఘటన మరువకముందే అనంతలో మరో దారుణం

  • నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

అనంతపురం క్రైం, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): సామాజిక విలువలు, కుటుంబ బంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి. ప్రేమ పేరుతో ఏర్పడుతున్న వివాహేతర సంబంధాలు హత్యలకు దాకా దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో భార్యలు తమ ప్రియుడి సహకారంతో భర్తలను హత్య చేస్తున్న ఘటనలు వరుసగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సంచలనం రేపిన తెలంగాణలోని గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య ఘటన మరువకముందే.. తాజాగా అనంతపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన మరో దారుణం స్థానికంగా కలకలం రేపింది.


వివాహ బంధాన్ని తృణప్రాయంగా తీసుకుని.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తాళి కట్టిన భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేయించిందో ఇల్లాలు. అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేషులు, రూరల్‌ సీఐ శేఖర్‌, ఎస్‌ఐ రాంబాబు ఈ కేసు వివరాలను బుధవారం విలేకరులకు వివరించారు. అనంతపురం రూరల్‌ మండలం అక్కంపల్లి పంచాయతీలోని సదాశివ కాలనీకి చెందిన నరసాపురం సురేష్‌ బాబు(43) అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య అనిత, ఇంటర్‌ చదివిన కొడుకు ఉన్నారు. కుమార్తె ఏడాదిన్నర క్రితం చనిపోయింది. అనిత నగరంలోని ఫస్ట్‌ రోడ్డులో ఉన్న ఒక హోటల్‌లో పనిచేసేది. ఆమెకు రెండు నెలల క్రితం ఆత్మకూరు మండలం గొరదిండ్లకు చెందిన, అవివాహితుడైన పండ్ల వ్యాపారి బాబా ఫకృద్దీన్‌తో పరిచయమైంది.


ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి బంధంపై అనిత భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను నిలదీసేవాడు. ఈ విషయం ఆమె తన ప్రియుడితో చెప్పింది. ఆపై తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నడని, సురే్‌షను కడతేర్చాలని ఇద్దరూ కుట్రపన్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను రాత్రి మూసేసిన తర్వాత తన భర్త టూ వీలర్‌పై ఇంటికి వస్తారని, ఆ మార్గంలో చంపేయాలని అనిత తన ప్రియుడికి సూచించింది. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి వస్తున్న సురే్‌షపై అక్కంపల్లి-రాచానపల్లి మధ్యలో నల్లలమ్మ గుడి వద్ద బాబా ఫకృద్దీన్‌ దాడి చేశాడు. ఖాళీ సీసాతో కొట్టడంతో సురేష్‌ బైక్‌పై నుంచి కింద పడ్డాడు. ఆ వెంటనే ఫకృద్దీన్‌ తన వెంట తెచ్చుకున్న స్ర్కూడ్రైవర్‌తో సురే్‌షను పొడిచాడు. తర్వాత బండ రాయితో మోది చంపేసి పరారయ్యాడు. హత్య విషయం దావానలంలా వ్యాపించడంతో డీఎస్పీ వెంకటేశులు సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి, దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు కుట్ర చేసింది భార్య అనిత కాగా, హత్య చేసింది ఆమె ప్రియుడేనని ఆరు గంటల వ్యవధిలోనే గుర్తించారు. వెంటనే ఇద్దరినీ అరెస్టు చేశారు.

Updated Date - Jun 26 , 2025 | 04:29 AM