Share News

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ బంగ్లా చూసి.. ఋషి కొండ ప్యాలస్‌ నిర్మించారేమో

ABN , Publish Date - Jul 22 , 2025 | 09:50 PM

విశాఖపట్నంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ పూసపాటి ఆనంద గజపతి రాజు 75 వ జయంతి వేడుకలు ఘనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద గజపతి రాజు జీవిత విశేషాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన సోదరుడు పూసపాటి అశోక్ గజపతి రాజు ఆవిష్కరించారు.

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ బంగ్లా చూసి..  ఋషి కొండ  ప్యాలస్‌ నిర్మించారేమో
Ashok Gajapathi Raju

విశాఖపట్నం, జులై 22: గోవా రాష్ట్ర గవర్నర్ బంగ్లా చూసి.. విశాఖపట్నంలో ఋషి కొండ మీద ప్యాలస్‌ నిర్మించి ఉంటారని వైసీపీ నేతలను ఉద్దేశించి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. గోవా గవర్నర్ బంగ్లాను పోర్చుగీసు వారు నిర్మించారని తెలిపారు. సముద్రం కనిపించేలా ఈ బంగ్లాను నిర్మించారని వివరించారు. అదే రీతిలో ఋషి కొండ ప్యాలస్‌ నిర్మాణాన్ని చేపట్టి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం విశాఖపట్నంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ పూసపాటి ఆనంద గజపతి రాజు 75 వ జయంతి వేడుకలు ఘనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద గజపతి రాజు జీవిత విశేషాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన సోదరుడు పూసపాటి అశోక్ గజపతి రాజు ఆవిష్కరించారు. అనంతరం గోవా గవర్నర్‌గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. ఎన్ టి రామారావు కేబినెట్‌లో మొదటి విద్యా శాఖ మంత్రిగా ఆనంద గజపతి రాజు పని చేశారని గుర్తు చేశారు. తమ వంశానికి చెందిన రాజులకోటలను విద్యా సంస్థలకు ఇచ్చామని తెలిపారు. అయితే తాను ఇప్పటి వరకు తూర్పున ఉన్నామని.. ప్రస్తుతం వెస్ట్ కోస్ట్ వైపు ఉన్న గోవా వెళ్తున్నానని చెప్పారు.


ఆనంద గజపతి నిత్యం ధర్మాన్ని పాటించే వారని పేర్కొన్నారు. అందరూ ఆ ధర్మాన్ని పాటించాలని తాను కోరుతున్నానని తెలిపారు. తమ కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అశోక్ గజపతి రాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ ఎంపీ ప్రదీప్ చంద్ర దేవ్, భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావుతోపాటు పూసపాటి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు కీలక శాఖలకు అశోక్ గజపతి రాజు మంత్రిగా పని చేశారు. ఇక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. అనంతరం మోదీ కేబినెట్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతి రాజు విజయనగరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. జులై 26వ తేదీన ఆ రాష్ట్ర గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఇంతకీ ఆ మూడున్నర గంటల మధ్య ఏం జరిగింది

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

For More AP News and Telugu News

Updated Date - Jul 22 , 2025 | 10:27 PM