Share News

CM Chandrababu: పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:27 PM

విశాఖపట్నంలో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తామని.. ఈ కేబుల్ ద్వారా నగరంతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖపట్నం ఎంపికైందని ఆయన గుర్తు చేశారు.

CM Chandrababu: పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

విశాఖపట్నం, ఆగస్టు 29: విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పిచ్చారంటూ ప్రజలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రహదారులపై గుంతలు పెట్టిన పాలకులు.. వాటిల్లోనే కొట్టుకు పోయారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం నాడు విశాఖపట్నంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన డబుల్‌ డెక్కర్‌ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భారత్‌కు టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం నగరం ఎదుగుతోందన్నారు. విశాఖపట్నం ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.


విశాఖపట్నంలో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తామని.. ఈ కేబుల్ ద్వారా ఈ నగరంతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని తెలిపారు. అలాగే మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖపట్నం ఎంపికైందని గుర్తు చేశారు. ఈ విశాఖ నగరం.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోందని వివరించారు. మహిళలకు విశాఖ సురక్షిత చిరునామాగా మారిందని.. ఇది మనమంతా గర్వపడే అంశమని ఆయన పేర్కొన్నారు.


ఇక ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ.250కే 24 గంటలపాటు ఈ టికెట్టు వర్తించేలా ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. పర్యాటకులంతా పర్యావరణహితంగా వ్యవహరించాలని, మన తీరప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఈ బీచ్‌లు నిర్వహించేందుకు సహకరించాలంటూ పౌరులకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.


కాగా, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ డబుల్ డెక్కర్ బస్సులు నడవనున్నాయి. ఆర్కే బీచ్ నుంచి తోట్లకొండ వరకు బీచ్ రోడ్డులో ఈ బస్సులు తిరగనున్నాయి. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణించనున్నాయి. 24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500గా నిర్ణయించారు. అయితే పర్యాటకుల సౌలభ్యం కోసం అందులో సగం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు కీలక సూచన

ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హజరవుతా..

For More AP News And Telugu News

Updated Date - Aug 29 , 2025 | 04:59 PM