Vijayawada Mosquito: దోమలు బాబోయ్.. పెరుగుతున్న బోదకాలు వ్యాధి వ్యాప్తి
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:15 PM
విజయవాడనగరంలోని 64 డివిజన్లను ఆరు మలేరియా డివిజన్లుగా విభిజించి కేవలం దోమల నివారణకు మాత్రమే రూ.3 కోట్ల బడ్జెట్ను కార్పొరేషన్ కేటాయించింది. ఈ నిధులతో మంచినీటిలో వృద్ధి చెంది.. మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఆనోతన్, డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఎడీస్, మురుగు నీటిలో వృద్ధి చెంది బోదకాలు వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే క్యూలెక్స్ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి.
విజయవాడ సిటీ, డిసెంబర్ 21: నగరంలోని 64 డివిజన్లను ఆరు మలేరియా డివిజన్లుగా విభిజించి కేవలం దోమల నివారణకు మాత్రమే రూ.3 కోట్ల బడ్జెట్ను కార్పొరేషన్ కేటాయించింది. ఈ నిధులతో మంచినీటిలో వృద్ధి చెంది.. మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఆనోతన్, డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఎడీస్, మురుగు నీటిలో వృద్ధి చెంది బోధకాల వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే క్యూలెక్స్ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. డ్రైయినేజీల్లో లార్వా నివారణతో పాటు దోమల నివారణకు స్ప్రేయింగ్ చేయడం, ఆయిల్ బాల్స్ వేయడం, పొగింగ్ వంటి పనులు చేయాలి. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉంటాయని, దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందనే అంచనా కార్పొరేషన్ అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్‌లో ఆరు నెలలు మాత్రమే (డిసెంబరు వరకు) పనిచేసేందుకు అదనంగా 60 మంది కార్మికులను అధికారులు నియమించారు. అప్పటికే కార్పొరేషన్ పరిధిలో ఈ విభాగానికి 264 మంది కార్మికులు ఉన్నారు.
ప్రస్తుతం 324 మంది పనిచేస్తున్నారు. సమూలంగా దోమలను నివారించాలని కేటాయించిన బడ్జెట్లతో డివిజన్‌కు రెండు చొప్పున 128 సాగింగ్ యంత్రాలను అధికారులు కొత్తగా కొన్నారు. వీటితో పాటు కొన్ని ఆటోలను, స్ప్రేయింగ్ మిషన్లనూ కొనుగోలు చేశారు. మూడు నెలలకు ఒకసారి నివారణకు అవసరమైన రసాయనాలు (వీఐటీ లిక్విడ్, థెమోఫో కస్, ఎంఎల్ ఆయిల్, పైరత్రం తదితరాలు) ను కొనుగోలు చేస్తున్నట్లు కార్యాలయ రికార్డుల్లో చూపిస్తున్నారు. దోమల నివారణకు రసాయనాలు, యంత్రాలు, పనిచేసే కార్మికులు, కావాల్సినన్ని నిధులు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఫలితం కనిపించకపోవడంపై అనేక ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. దోమల నివారణ చర్యలు సక్రమంగా జరగడం లేదని కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ముక్తకంఠంతో చెప్పారు. రాజకీయ అజెండాలపై పరస్పర ఆరోపణలు చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు దోమల సమస్య ప్రస్తావనకు రాగానే ఏకతాటిపైకి వచ్చారు.
అయినప్పటికీ చర్యలు ఏమాత్రం తీసుకోలేదు. ఒకటి రెండుచోట్ల మొక్కుబడిగా దోమల నివారణ చర్యలు తీసుకున్నట్లు పేపర్లలో నమోదు చేసి, ఫొటోలు దిగి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దోమల వృద్ధికి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీల్లో పేరుకుపోతున్న మురుగు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. మురుగులో లార్వాలను అభివృద్ధి చేసుకుని దోమల సంఖ్యను పెంచుకుంటున్నాయి. డ్రెయిజీల్లో పేరుకున్న మురుగును తొలగించేందుకు ప్రత్యేకంగా ఉన్న యంత్రాలు డిపోకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
విస్తరిస్తున్న వ్యాధులు
దోమల కారణంగా నగరంలో ఇటీవల బోధకాల వ్యాధి వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. క్యూలెక్స్ దోమ 150 సార్లు కుడితే ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గడిచిన వారంలో నగరంలో ఆరుగురు ఈ వ్యాధి బారిన పడినట్లు కార్పొరేషన్ అధికారులే చెబుతున్నారు. డెంగీ, మలేరియా వ్యాప్తి ఎక్కువగా లేకపోవడం కాస్త ఊరటనిచ్చినా.. సత్వరమే దోమల నివారణపై చర్యలు వేగవంతం చేయకపోతే ఆ కేసులు సైతం పెరిగే అవకాశం ఉంది.
'గతంలో దోమలు రాత్రి సమయంలో మాత్రమే కుట్టేవి. కొన్ని నెలలుగా పగటిపూట కూడా కుట్టేస్తున్నాయి. దోమల వివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. స్ప్రేయింగ్ పనులు ఎక్కడా జరగట్లేదు. ప్రజలు బోధకాల వ్యాధి బారిన పడుతున్నారు. అయినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు' అని ఈ నెల 10వ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు ముక్తకంఠంతో తెలిపారు. కార్పొరేటర్లే సమస్య గురించి చెబుతున్నా.. దోమల స్వైరవిహారంపై తరచూ ఫిర్యాదులు అందుతున్నా.. అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో ఇటీవల బోధకాలు వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
సెన్సార్, ఎలివేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు
'దోమల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రోజూ అన్ని డివిజ న్లలో స్ప్రేయింగ్, ఫాగింగ్ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. మురుగు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. కమిషనర్ ధ్యాన్చంద్ర ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో దోమల సెన్సార్లు, ఎలివేషన్ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నా హాలు చేస్తున్నాం' అని బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లిలో కళకళలాడాలంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి
జగన్ పుట్టినరోజు వేడుకలపై తీవ్రంగా స్పందించిన యనమల