Gravel Truck Overturns: మృత్యువులా మీద పడ్డ కంకర ట్రక్.. ఇంటి బయట కూర్చున్న వృద్ధుడిపై..
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:56 AM
ఓ వృద్ధుడి జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా ముగిసిపోయింది. ఇంటి బయట సేద తీరుతున్న అతడిని కంకర ట్రక్ రూపంలో మృత్యువు కబళించింది. కంకర ట్రక్ మీదపడ్డంతో వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు.
మనిషి జీవితం చాలా విచిత్రమైనది. ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణం కోసం నానా తంటాలు పడుతుంటాడు. కనీస అవసరాలకు మించి అతిగా ఆలోచించి లేని పోని ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటాడు. లేని దాని కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటాడు. విలువైన సమయాన్ని అనవసరమైన విషయాల కోసం నాశనం చేసుకుంటూ ఉంటాడు. మన సమాజంలో చోటుచేసుకునే కొన్ని విషాద సంఘటనలను చూసినపుడు ఇదే కదా మన జీవితం. ఇందుకోసమా ఇంత ఆరాటపడుతోంది అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చావుకు సంబంధించిన సంఘటనలు చూసినపుడు మనసు చివుక్కుమంటుంది. వైరాగ్యం పుట్టుకువస్తుంది. నిజంగా మనకు కావాల్సింది ఏంటో గుర్తుకు వస్తుంది.
తాజాగా, మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధుడి జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా ముగిసిపోయింది. ఇంటి బయట సేద తీరుతున్న అతడిని కంకర ట్రక్ రూపంలో మృత్యువు కబళించింది. కంకర ట్రక్ మీదపడ్డంతో వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌కు చెందిన 90 ఏళ్ల గిరిరాజ్ శర్మ తన మనవడు సతీష్ శర్మ ఇంట్లో ఉంటున్నాడు. ఆయన ప్రతీ రోజూ ఉదయం ఎండ మొదలయ్యే సమయంలో ఇంటి బయట కూర్చునే వాడు. సూర్య రశ్మిని ఆస్వాదించే వాడు. శుక్రవారం ఉదయం కూడా ఇంటి బయట ఉన్న అరుగు మీద కూర్చుని ఉన్నాడు.
ఆ ఇంటికి కొద్ది దూరంలో ఓ భవంతి నిర్మాణం జరుగుతోంది. భవంతి నిర్మాణం కోసం కంకర తీసుకెళుతున్న ఓ ట్రక్ ఆ ఇంటి వైపు వచ్చింది. ఆ ప్రాంతంలో కొత్తగా వేసిన వాటర్ పైప్ లీకేజీ కారణంగా ఇంటి బయట ఉన్న రోడ్డు బురదమయం అయింది. భారీ బరువు ఉన్న ట్రక్ బురదలో ఇరుక్కుని ముందుకు వెళ్లలేకపోయింది. గిరిరాజ్ ఉన్న వైపు కూలబడింది. ట్రక్ మొత్తం అరుగు మీద కూర్చున్న గిరిరాజ్‌పై పడింది. గిరిరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు గిరిరాజ్ మరణంపై ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
పెళ్లిలో కళకళలాడాలంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి
జగన్ పుట్టినరోజు వేడుకలపై తీవ్రంగా స్పందించిన యనమల