Share News

AP High Court : దారికొచ్చిన విజయసాయి

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:56 AM

విశాఖ భీమిలి సాగరతీరాన అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం హైకోర్టు కేసులతో దారికి వచ్చింది.

AP High Court : దారికొచ్చిన విజయసాయి

  • హైకోర్టు కేసులతో మాజీ ఎంపీ వెనుకడుగు

  • విశాఖ బీచ్‌ భూముల్లో ప్రహరీ నిర్మాణానికి దరఖాస్తు

  • వైసీపీ హయాంలో అడ్డగోలుగా నిర్మాణాలు

  • కుమార్తె నేహారెడ్డి సంస్థ పేరిట లావాదేవీలు

  • ఇటీవల హైకోర్టు సీరియ్‌స..కమిటీ ఏర్పాటు

  • దీంతో దిగివచ్చి అనుమతులకు విజయసాయి వినతి

  • పది కొర్రీలతో దరఖాస్తు తిప్పి పంపిన అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అధికారం చేతిలో ఉందని అనుమతులు లేకుండా విశాఖ భీమిలి సాగరతీరాన అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం హైకోర్టు కేసులతో దారికి వచ్చింది. అధికారం కోల్పోయాక అనుమతులు తప్పనిసరి అని అర్థం కావడంతో ఇప్పుడు అరకొర సమాచారంతో దరఖాస్తు సమర్పించింది. దానిని అధికారులు పరిశీలించి సరైన సమాచారంతో అందజేయాలంటూ తిప్పి పంపారు. వివరాల్లోకి వెళితే.. విజయసాయిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సభ్యునిగా, వైసీపీ ఉత్తరాంరఽధ సమన్వయకర్తగాను వ్యవహరించారు. ఆ సమయంలో భీమిలి సాగర తీరాన పలువురు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఆ వ్యవహారాలన్నీ కుమార్తె నేహారెడ్డికి చెందిన సంస్థల పేరు మీద నడిపించారు. భీమిలి బీచ్‌ను ఆనుకొని ఉన్న ఆ భూముల్లో ఆయన ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రహరీ గోడలు నిర్మించారు. సముద్రంలో గెడ్డ కలిసేచోట ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వేయించారు. వీటిపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దఫదఫాలుగా విచారణ సాగిన ఈ కేసులో ఈ నెల 5న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. భీమిలి బీచ్‌లో అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని, వాటికి సంబంధించిన వివరాలన్నీ వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నిజాయితీ కలిగిన వివిధ శాఖల అధికారులతో కమిటీ వేసి వారితో ఈ పని చేయించాలని సూచించింది.


దాంతో భీమిలి ఆర్డీవో కె.సంగీత్‌ మాధుర్‌, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ (ఫైనాన్స్‌) ఎస్‌.ఎ్‌స.వర్మ, ఎన్‌ఐవో సైంటిస్ట్ -ఇన్‌చార్జివీవీఎస్ఎస్‌ శర్మ, విజయవాడకు చెందిన కాలుష్య నియంత్రణ మండలి సీనియర్‌ ఈఈ పీవీబీఎల్‌జీ శాస్త్రితో కమిటీ ఏర్పాటుచేశారు. వారు ఈ నెల 8న భీమిలి సాగర తీరం అంతా సర్వే చేశారు. ఏయే స్థలాలపై ఆరోపణలు వచ్చాయో వాటితో పాటు భీమిలి బీచ్‌ రోడ్డులోని ఇతర ఆక్రమణలపైనా దృష్టిపెట్టారు. నివేదిక అదే రోజు తయారుచేసి కలెక్టర్‌కు సమర్పించారు. అక్కడి నుంచి అది హైకోర్టుకు చేరింది.

సీజెడ్‌ఎంఏకు దరఖాస్తు

కోస్తా నియంత్రణ మండలిలో (సీఆర్‌జెడ్‌) అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో కేసు నడుస్తుండడంతో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం సాధ్యం కాదని సాయిరెడ్డి బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో భీమునిపట్నం, నేరెళ్లవలస సర్వే నంబర్లు 1516, 1517, 1517/3, 1519/1, 1519/2, 1518, 1522, 1086లలో గల భూమికి ప్రహరీ గోడలు నిర్మిస్తామని, అనుమతులు ఇవ్వాలని ‘అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీ’ పేరుతో 2024 డిసెంబరు 19న ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి(ఏపీసీజెడ్‌ఎంఏ) దరఖాస్తు చేశారు. హైకోర్టు ఈ అంశంపై సీరియ్‌సగా ఉండడంతో సీజెడ్‌ఎంఏ అధికారులు ఈ దరఖాస్తును పూర్తిగా పరిశీలించి పది కొర్రీలతో వెనక్కి పంపించారు. దరఖాస్తు చేసిన సర్వే నంబర్లలో మొత్తం భూమి 23,700 చదరపు గజాలు ఉందని, అందులో ఏ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్నారో స్పష్టత చేయలేదని, దాని అంచనా వ్యయం కూడా పేర్కొనలేదని, ప్రహరీ గోడ ఎంత విస్తీర్ణంలో (బిల్టప్‌ ఏరియా) నిర్మిస్తారో స్పష్టత లేదంటూ ‘అవ్యాన్‌’కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఆ భూమి అంతా పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని, జీవీఎంసీ ద్వారా సరిహద్దులకు జియో కో-ఆర్డినేట్లు చూపించాలని, అక్కడ భవిష్యత్తులో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టబోతున్నారో తెలపాలని, ప్రస్తుతం ఆయా భూముల్లో ఉన్న పురాతన భవనాల తొలగింపునకు అనుమతులు తీసుకోవాలని, ఆ భూములపై కోర్టు కేసుల వివరాలు, న్యాయస్థానం ఆదేశాలు చూపాలని సూచించారు. అక్కడ 20 వేల చదరపు మీటర్లు కంటే ఎక్కువ నిర్మాణం చేపడితే వాటికి అదనంగా మరిన్ని వివరాలు సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated Date - Feb 15 , 2025 | 04:56 AM