Gangotri Tragedy: గంగోత్రికి వెళ్తూ కూలిన హెలికాప్టర్
ABN , Publish Date - May 09 , 2025 | 03:05 AM
ఉత్తరాఖండ్‌లో గంగోత్రికి వెళ్తూ హెలికాప్టర్ కూలిన ఘటనలో అనంత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి మృతి చెందారు. ఆమె భర్త భాస్కర్ తీవ్రంగా గాయపడి రుషికేశ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు
అనంత టీడీపీ ఎంపీ సోదరి దుర్మరణం
మరో ఐదుగురు కూడా
ఆమె భర్తకు తీవ్రగాయాలు
గుంతకల్లు, మే 8(ఆంధ్రజ్యోతి): ఉత్తరాఖండ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి దుర్మరణం పాలయ్యారు. ఆమె భర్త ముష్టూరు భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం రుషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగినపుడు హెలికాప్టర్‌లో కెప్టెన్‌తో సహా మొత్తం ఏడుగురు ఉన్నారు. వారిలో ఆరుగురు... కళా చంద్రకాంత్ సోనీ (61), విజయారెడ్డి (57), రుచి అగర్వాల్ (56), రాధా అగర్వాల్ (79), వేదవతి కుమారి (48), కెప్టెన్ రాబిన్ సింగ్ (60) మృతి చెందారు. మరణించిన వారిలో ముగ్గురు ముంబయికి చెందిన వారు. యూపీ, ఆంధ్రకు చెందిన వారు ఒక్కక్కరు ఉన్నారు. కెప్టెన్ గుజరాత్‌కు చెందిన వ్యక్తి. కాగా, ఎంపీ సోదరి కుటుంబం గుంతకల్లులో నివాసం ఉంటోంది. వేదవతి భర్త భాస్కర్ స్థానికంగా నర్సింగ్ హోం నిర్వాహకుడిగా సుపరిచితుడు.
మూడు రోజుల క్రితం ఆ దంపతులు చార్‌దామ్ తీర్థయాత్రకు వెళ్లారు. వాళ్లు గంగోత్రికి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఆ హెలికాప్టర్ డెహ్రాడూన్‌లోని సహస్రధార హెలీప్యాడ్ నుంచి ఖర్సాలీ హెలీప్యాడ్‌కు గురువారం ఉదయం బయలుదేరింది. గంగోత్రికి వెళ్తుండగా ప్రతికూల వాతావరణంతో ఉదయం సుమారు 8.45 గంటలకు రుషికేశ్-గంగోత్రి జాతీయ రహదారిపై పడిన హెలికాప్టర్... 200-250 మీటర్ల లోతు లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో భాస్కర్ ఒక్కరే తీవ్ర గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు విక్కీ, భాస్కర్ కుమారుడు సాయి బెంగళూరు నుంచి విమానంలో హుటాహుటిన బయలుదేరారు. భాస్కర్ మరో కుమారుడు అభిషేక్, సమీప బంధువులు హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లారు. గాయపడిన భాస్కర్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..
ఆపరేషన్ సిందూర్‌పై చైనా, అమెరికా స్పందన
For More AP News and Telugu News