Share News

AP Police : ఆయుష్‌ ఆస్పత్రి నుంచి..కార్లో హైదరాబాద్‌ తీసుకెళ్లారు!

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:25 AM

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉంటూ యూటర్న్‌ తీసుకున్న ముదునూరి సత్యవర్ధన్‌ వాంగ్మూలాన్ని విజయవాడ పటమట పోలీసులు నమోదు చేశారు.

AP Police : ఆయుష్‌ ఆస్పత్రి నుంచి..కార్లో హైదరాబాద్‌ తీసుకెళ్లారు!

  • హనుమాన్‌జంక్షన్‌ వద్ద ఓ ఇంట్లో అఫిడవిట్‌పై బలవంతపు సంతకాలు

  • పోలీసులకు సత్యవర్ధన్‌ వాంగ్మూలం!

విజయవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉంటూ యూటర్న్‌ తీసుకున్న ముదునూరి సత్యవర్ధన్‌ వాంగ్మూలాన్ని విజయవాడ పటమట పోలీసులు నమోదు చేశారు. వల్లభవనేని వంశీ అనుచరులు తనను ఎలా ట్రాప్‌ చేశారు.. ఎవరెవరు ఎక్కడెక్కడ తిప్పారో ఆయన వివరించారు. ముఖ్యంగా కొమ్మా కోట్లు, ఓలుపల్లి మోహనరంగారావు పేర్లను చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయుష్‌ ఆసుపత్రి నుంచి కారులో హనుమాన్‌ జంక్షన్‌కు తీసుకెళ్లి బలవంతంగా ఓ ఇంట్లో అఫిడవిట్‌పై సంతకం చేయించుకున్నట్టు వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత అక్కడి నుంచే కారులో విజయవాడలో కోర్టుకు తీసుకెళ్లారని చెప్పాడు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో న్యాయాధికారికి అఫిడవిట్‌ను అందజేశాక కారులో ఎవరెవరు హైదరాబాద్‌కు తీసుకెళ్లారో పేర్లను వివరించినట్టు సమాచారం. అక్కడి నుంచి మైహోం భూజాలోని వంశీ ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా చిత్రహింసలు పెట్టిన తర్వాత అదే కారులో వైజాగ్‌లో ఉంటున్న వంశీ స్నేహితుల గెస్ట్‌హౌస్‌కు తరలించినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. పోలీసులకు 161 వాంగ్మూలం ఇచ్చిన సత్యవర్ధన్‌ సోమవారం కోర్టులో న్యాయాధికారి ముందు ఇచ్చే అవకాశం ఉంది.

కొత్త దుప్పట్లు ఇవ్వండి

ఆ బ్యారక్‌లో ఉండను.. ఈ టాయిలెట్‌ వాడను.. నాకు ప్రత్యేకంగా మంచం కావాలని విజయవాడ జిల్లా జైలు అధికారులపై చిందులు తొక్కిన వల్లభనేని వంశీ.. తాజాగా కొత్త దుప్పట్ల కోసం పట్టుబట్టారు. అయితే ఖైదీలెవరికీ కొత్త బెడ్‌షీట్లు ఇవ్వరని, ఉతికినవి మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నా కోర్టు ఆదేశాలు ఉండాల్సిందేనని మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వంశీ మరో మాట మాట్లాడలేదని తెలిసింది.

Updated Date - Feb 16 , 2025 | 04:25 AM