Vallabhaneni Vamsi : తెలీదు.. మరిచిపోయా.. గుర్తులేదు!
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:36 AM
వంశీనే నిర్మించిన అదుర్స్ సినిమాలో హీరో కొన్ని సందర్భాల్లో ‘తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అని సమాధానాలు చెబుతాడు. ఈ డైలాగులనే పోలీసులు అడిగిన ప్రశ్నలకు..

దర్యాప్తు అధికారుల విచారణలో ‘అదుర్స్’ చూపించిన వైసీపీ నేత వంశీ
సత్యవర్ధన్ ఎవరో కూడా తెలియదట
ఒక రాత్రంతా సత్యవర్ధన్ తన ఇంట్లో ఉన్నాడని వెల్లడి.. కానీ, గుర్తించలేదట!
ఇంటి నుంచి వెళ్లిపోయాకే తెలిసిందట
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో యూటర్న్‌పై బలవంతం చేయలేదట
ఫోన్లు ఎక్కడున్నాయో గుర్తులేదని వెల్లడి
సత్యవర్ధన్ ఎక్కిన కారు తనది కాదని బొంకు
తొలి రోజు రెండు గంటలపాటు విచారణ
30 ప్రశ్నలు సంధించిన దర్యాప్తు అధికారి
విజయవాడ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పోలీసుల విచారణలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ‘అదుర్స్’ సినిమా చూపించారు. వంశీనే నిర్మించిన అదుర్స్ సినిమాలో హీరో కొన్ని సందర్భాల్లో ‘తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అని సమాధానాలు చెబుతాడు. ఈ డైలాగులనే పోలీసులు అడిగిన ప్రశ్నలకు.. ‘‘తెలీదు, గుర్తులేదు, మరచిపోయా’’ అని జవాబులు ఇచ్చినట్టు సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్దన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీమోహన్, ఏడో నిందితుడు వెలినేని వెంకట శివరామకృష్ణప్రసాద్, ఎనిమిదో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు మంగళవారం ఉదయం కస్టడీకి తీసుకున్నారు. ముందుగా ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ముగ్గురు నిందితులను విచారించడానికి ముగ్గురు ఏసీపీలు రంగంలోకి దిగారు. వల్లభనేని వంశీని సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ విచారించారు. శివరామకృష్ణప్రసాద్‌ను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్‌గౌడ్, లక్ష్మీపతిని సీసీఎస్ ఏసీపీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క నిందితుడికి సుమారు 30 ప్రశ్నలు సంధించారు. రెండు గంటల పాటు వారిని విచారించారు. కాగా.. విచారణాధికారి అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే వంశీ సమాధానాలు చెప్పారు. చాలా వాటికి అబద్ధాలు చెప్పారని విచారణాధికారులు భావిస్తున్నా రు. సత్యవర్దన్ తనకు తెలియదని ముందుగా స మాధానమిచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు విచారణాధికారికి వంశీ చెప్పినజవాబులు ఇవీ..
అధికారి: మీరెవరో తెలియకుండా సత్యవర్దన్ మీ ఇంటికి వచ్చాడా?
వంశీ: పదో తేదీ అర్ధరాత్రి తన ఫ్లాట్‌కు వచ్చా డు. రాత్రంతా మా ఫ్లాట్‌లో ఉన్నాడు. 11వ తేదీ ఉదయం వెళ్లిపోయాడు. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ అతనేనని ఆ తర్వాత తెలిసింది.
అధికారి: సత్యవర్దన్‌ను ఎందుకు బెదిరించారు?
వంశీ: అతనిని ఎవరూ బలవంతం చేయలేదు. తనంతట తానే కోర్టుకు వెళ్లి న్యాయాధికారి ముందు వాంగ్మూలం ఇచ్చాడు.
అధికారి: విజయవాడ నుంచి సత్యవర్దన్‌ను హైదరాబాద్‌కు తరలించిన కారు మీదే కదా? అదెక్కడ ఉంది?
వంశీ: అసలు నాకు కారు లేదు.
అధికారి: మైహోం భూజా నుంచి మీకు సంబంధించిన కారుల్లోనే సత్యవర్దన్‌ను వైజాగ్‌కు తీసుకెళ్లారు కదా?
వంశీ: ఆ కార్లు ఎవరివో తెలియదు.
అధికారి: పోలీసులు అరెస్టు చేయడానికి ముందు వరకు ఉపయోగించిన
ఫోన్ ఎక్కడుంది?
వంశీ: దాన్ని ఎక్కడ పెట్టానో గుర్తులేదు. తెలీదు. నేను మూడు ఫోన్లు వాడతా. వాటిని ఎక్కడ పెట్టానో తెలీదు.
అధికారి: కారులో మీరూ వైజాగ్ వెళ్లారు కదా?
వంశీ: నేను వెళ్లలేదు.
అధికారి: ఎర్రంశెట్టి రామాంజనేయులు,కొమ్మా కోట్లు, ఓలుపల్లి మోహనరంగారావు మీ అనుచరులే కదా?
వంశీ: ఔను. వాళ్లంతా నా అనుచరులే.
అధికారి: సత్యవర్దన్ కేసులో వాళ్లంతా నిందితులుగా ఉన్నారు. మీరు చెప్తేనే వాళ్లు అతడిని బెదిరించారు కదా?
వంశీ: ఆ విషయం నాకు తెలీదు.
ఆ ఇద్దరూ ఒప్పుకొన్నారు!
ఈ కేసులో మిగిలిన నిందితులు శివరామకృష్ణప్రసాద్, లక్ష్మీపతి మాత్రం వారికి ఎవరెవరు ఏయే బాధ్యతలు అప్పగించారో వారి పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. సత్యవర్ధన్ కోర్టులో వాం గ్మూలం ఇచ్చిన తర్వాత తామే అతడిని వంశీ ఫ్లాట్‌కు తీసుకెళ్లినట్టు అంగీకరించారని, కారులో తీసుకువెళ్లినట్టు చెప్పారని సమాచారం.
భోజనం వద్దు.. నీళ్లు చాలు
పోలీసుల విచారణ సమయంలో ఆహారం ముట్టుకోవడానికి వంశీ ఇష్టపడలేదని తెలిసింది. వంశీని విచారిస్తున్న ఏసీపీ దామోదర్ మధ్యాహ్న సమయంలో భోజనం చేయమని అడిగారు. తాను భోజనం చేయనని వంశీ సమాధానం ఇచ్చారు. ఏసీపీ రెండు, మూడుసార్లు అడిగినా ఆయన ఇదే సమాధానం చెప్పారు. ఉదయం నుంచి సాయం త్రం వరకు పలుమార్లు కాఫీ, టీ తాగుతారా.. అని అడిగినా వద్దని జవాబిచ్చారు. తాగడానికి నీళ్లు మాత్రం ఇవ్వమని కోరారు. మిగిలిన ఇద్దరు నిందితులు భోజనాలు చేశారు. జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వంశీని గేటు బయటకు తీసుకురాగానే అక్కడే ఉన్న సిబ్బందికి ఆయన ‘గుడ్‌మార్నింగ్’ చెప్పారు.
వంశీ రిమాండ్ పొడిగింపు
జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ మంగళవారంతో ముగియడంతో దీన్ని మార్చి 11 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయాధికారి బీఎస్వీ హిమబిందు తెలిపారు.
కస్టడీని రద్దు చేయండి: కోర్టులో మెమో
వంశీ మూడు రోజుల కస్టడీని రద్దు చేయాలని కోరుతూ కోర్టులో మంగళవారం మెమో దాఖలైంది. నిందితుల తరఫు న్యాయవాది తానికొండ చిరంజీవి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో ఆ మెమో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితులను విచారించే ప్రదేశం ముందుగా వారి తరఫున న్యాయవాదులకు తెలియజేయాలని, విచారణ సమయంలో మూడు నుంచి నాలుగుసార్లు నిందితులతో న్యాయవాదులు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విషయాలను దర్యాప్తు అధికారులు తమకు తెలియజేయలేదని, అందువల్ల పోలీసు కస్టడీని రద్దు చేయాలని కోరారు.