Amaravati : హైకోర్టులో వంశీకి షాక్
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:59 AM
వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వంశీ కారులో సత్యవర్ధన్!
వాంగ్మూలం ఇచ్చాక బెజవాడ నుంచి హైదరాబాద్‌కు
10వ తేదీ రాత్రంతా వల్లభనేని ఫ్లాట్‌లోనే
ఆ మరుసటి రోజు రెండు కార్లలో విశాఖకు తరలింపు
సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషిస్తున్న పోలీసులు
అమరావతి/విజయవాడ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఉమ్మడి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత ఏడాది ఆగస్టులో వంశీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిర్ణయం వెల్లడించే వరకు వంశీకి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఇటీవల తుది విచారణ జరిపింది. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. వంశీ వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని, దానిని కొట్టివేయాలని కోరారు. వంశీ తరఫున సీనియర్ న్యాయవాది పట్టాభి, న్యాయవాది దేవి సత్యశ్రీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో నిర్ణయం వాయిదా వేసిన న్యాయస్థానం.. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.
కస్టడీ పిటిషన్‌పై తీర్పు నేడు
వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించనుంది. ఈ పిటిషన్‌పై వాదనలు గురువారం ముగిశాయి. వంశీ నుంచి కీలకమైన సమాచారం రాబట్టడానికి ఆయనను కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్రప్రసాద్, ప్రాసిక్యూటర్ కల్యాణి వాదించారు. ఆయన నుంచి రికవరీ చేసుకోవలసిన వస్తువులు ఉన్నాయని వివరించారు. దీనికి లక్ష్మీపతి తరఫు న్యాయవాది తానికొండ చిరంజీవి అభ్యంతరం తెలిపారు. కాగా, వంశీ విషయంలో భద్రతాపరంగా జైలులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ పాల్ హంస ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు వివరించారు. ఆయన ఉన్న బ్యారక్‌లో కొత్తగా ఎటువంటి సీసీ కెమెరాలూ ఏర్పాటు చేయలేదని, ఇంతకుముందు ఏర్పాటు చేసినవే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇంటి నుంచి భోజనం అనుమతించాలని, మంచం ఏర్పాటు చేయించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ జరిగింది. వంశీ తరఫు న్యాయవాదులు ఆయన ఆరోగ్య సమస్యలపై వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదికలు పాతవని, వాటిని పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని జైలు అధికారి రోషన్ చెప్పారు. ఈ పిటిషన్‌పై తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేస్తున్నట్టు న్యాయాధికారి హిమబిందు వెల్లడించారు.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ ఈ కేసుతో తనకు సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వంశీ స్వయంగా కారులో హైదరాబాద్‌కు తీసుకెళ్లారా? ఆ రోజు వంశీ విజయవాడలో ఉన్నారా? సత్యవర్ధన్ తరలింపునకు క్రెటా కారును ఉపయోగించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 10న సత్యవర్ధన్ విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చి బయటకు రాగానే క్రెటా కారులో ఆయన్ను ఎక్కించినట్టు పోలీసులు భావిస్తున్నారు. వంశీని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన తర్వాత రెండు పోలీసు బృందాలు హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని మైహోం భూజాలో ఉన్న ఆయన ఫ్లాట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి వివిధ సీసీ కెమెరాలను పరిశీలించి ఫుటేజీతీసుకొచ్చారు. వాటిని ప్రస్తుతం సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషిస్తున్నారు. సత్యవర్ధన్‌ను డీల్ చేయడంలో వంశీ ప్రధాన అనుచరులు కొమ్మా కోట్లు, ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగా కీలకంగా వ్యవహరించారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. న్యాయాధికారి ముందు ఏం చెప్పాలో ముందుగానే సత్యవర్ధన్‌కు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత కోర్టు వద్దకు కారులో తీసుకొచ్చారు. అతడు న్యాయాధికారి ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత బయటకు రాగానే కారులో ఎక్కించుకుని హైదరాబాద్‌కు తరలించినట్టు నిర్ధారించారు. ఈ కారులో సత్యవర్ధన్ ఉన్నాడని తేల్చిన పోలీసులు ఇంకా ఎవరెవరు ఉన్నారో కనుగొనే పనిలో పడ్డారు. ఈ కారులో వంశీతో పాటు హనుమాన్ జంక్షన్‌కు చెందిన ఎర్రంశెట్టి రామాంజనేయులు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 10న సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరిన వారు అర్ధరాత్రి 12 గంటలకు మైహోం భూజాకు చేరుకున్నట్టు సమాచారం. 11న అక్కడి నుంచి వంశీ ఒక కారులో, సత్యవర్ధన్‌తో ఆయన అనుచరులు మరో కారులో వైజాగ్‌కు బయలుదేరారు. ఖమ్మం మీదుగా అతడిని విశాఖపట్నం తరలించి వంశీకి పరిచయం ఉన్న చేబ్రోలు శ్రీనుకు అప్పగించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లేటప్పుడు కోదాడ మార్గం గుండా వెళ్లినట్టు సమాచారం.