Andhra Pradesh: యూరియా కొరత తీర్చేందుకు కేంద్రం నుంచి అత్యవసర సరఫరా..
ABN , Publish Date - Aug 28 , 2025 | 07:22 PM
ఏపీ రైతులకు శుభవార్త. రాష్ట్రానికి తక్షణ అవసరాల నిమిత్తం 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎన్డీయే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు కేంద్రం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రితో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు.
10,350 మెట్రిక్ టన్నుల యూరియా విడుదల
ఈ మేరకు రాష్ట్రానికి తక్షణ అవసరాల నిమిత్తం 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ యూరియా విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి కాబోతోంది.
యుద్ధప్రాతిపదికన పంపిణీకి ఆదేశాలు
యూరియా కోసం అత్యవసరంగా ఎదురుచూస్తున్న జిల్లాలకు వెంటనే సరఫరా చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన యూరియా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. నిజానికి గంగవరం పోర్ట్‌కు సెప్టెంబర్ 6వ తేదీన యూరియా షిప్ రావాల్సి ఉండగా.. రైతుల అత్యవసర అవసరాల దృష్ట్యా షిప్‌ను వారం ముందే వచ్చేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
కాకినాడ పోర్ట్‌కు మరిన్ని నిల్వలు
సెప్టెంబర్ మొదటివారం చివర్లో కాకినాడ పోర్ట్‌కు మరో 30,000 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇది కూడా ఏపీ అన్నదాతల అవసరాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. మరోవైపు రైతులకు ఎరువుల కొరతా రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు అవసరమైన సమయంలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Also Read:
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..
బీడబ్ల్యూఎఫ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన పీవీ సింధు
For More Latest News