TTD: ఘాట్‌లో ప్రతి బండిపై నిఘా..
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:10 AM
తిరుమల ఘాట్ రోడ్లలో ప్రయాణించే ప్రతి వాహనాన్నీ గుర్తించేందుకు ఆటోమ్యాటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్
తిరుమల ఘాట్‌లలో ఏఎన్‌పీఆర్ వ్యవస్థ ఏర్పాటు దిశగా టీటీడీ
సీసీ కెమెరాలతో అనుసంధానం.. వచ్చివెళ్లే ప్రతి వాహనం గుర్తింపు
ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ సంస్థ
తిరుమల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల ఘాట్ రోడ్లలో ప్రయాణించే ప్రతి వాహనాన్నీ గుర్తించేందుకు ‘ఆటోమ్యాటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్’ (ఏఎన్‌పీఆర్) వ్యవస్థ ఏర్పాటుకు టీటీడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం తిరుమలకు రోజూ 7వేల నుంచి 10వేల వాహనాలు వచ్చి వెళ్తున్నాయి. టోల్ గేట్లలో నమోదయ్యే సమాచారం తప్ప ఈ వాహనాలకు సంబంధించిన రికార్డులేవీ టీటీడీ వద్ద ఉండవు. ఈ క్రమంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ ధార్మిక క్షేత్రంలో భద్రతను మరింత పెంచేందుకు ఏఎన్‌పీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. తిరుమలలో 2,780 సీసీ కెమెరాలున్నా ఘాట్‌రోడ్లలో మాత్రం లేవు. దీంతో ఘాట్ రోడ్లలో సోలార్‌తో పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని ఏఎన్‌పీఆర్ వ్యవస్థతో అనుసంధానం చేస్తే.. వాహనం సీసీ కెమెరా ముందుకు రాగానే నంబర్ ప్లేట్‌ను గుర్తించి నమోదు చేస్తుంది. కాబట్టి ఏ వాహనం ఏ సమయంలో ఏ ప్రాంతంలో ఉంది అనే సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. వాహనం నంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు ఆ వాహనం ఏయే రోజుల్లో, ఏయే సమయాల్లో తిరుమల ఘాట్ రోడ్లలో కనిపించిందో మొత్తం రికార్డు లభ్యమవుతుంది. ఇప్పటికే 40కిపైగా స్మార్ట్ సిటీల్లో ఈ వ్యవస్థను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ తిరుమలలోనూ దీన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనిపై నివేదిక సమర్పించాలని టీటీడీ ఎల్ అండ్ టీ సంస్థను కోరింది.
హెల్మెట్ లేకపోతే దొరికిపోతారు
దీంతోపాటూ ఘాట్ రోడ్లలో ‘నో హెల్మెట్ డిటక్షన్’ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం రోజుకు వెయ్యి దాకా బైక్‌లు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుమలకు హెల్మెట్ లేకుండా అనుమతించరు. అయితే టోల్‌గేట్ దాటగానే చాలామంది హెల్మెట్ తీసేస్తున్నారని టీటీడీ గుర్తించింది. ‘నో హెల్మెట్ డిటెక్షన్’ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటే హెల్మెట్ లేని వాహనాన్ని గుర్తించి ఆటోమ్యాటిక్‌గా జరిమానా విధించే అవకాశం ఉంటుంది.