AP Minister Ram Prasad Reddy : ఏటీఎస్‌ల సమస్య కేంద్రం దృష్టికి!
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:59 AM
‘ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్ష కేంద్రాలు ఆటోవాలాకు బాగా దూరం అవుతున్నాయ్. శైవ క్షేత్రం శ్రీశైలం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 200 కి.మీ దూరం ప్రయాణించాలి.

ఢిల్లీ వెళ్లిన రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి
నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చ
రాష్ట్రంలో కనీసం 63 చోట్ల ఏటీఎ్‌సలు ఉండాలి
కర్ణాటకలో ప్రభుత్వమే ఏర్పాటు చేసింది
ఏపీలోనూ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి?
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ‘ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్ష కేంద్రాలు ఆటోవాలాకు బాగా దూరం అవుతున్నాయ్. శైవ క్షేత్రం శ్రీశైలం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 200 కి.మీ దూరం ప్రయాణించాలి. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఫిట్నెస్ సెంటర్లలోనే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు(ఏటీఎస్) ఏర్పాటు చేయండి’ అంటూ రాష్ట్రంలోని వాహనదారులు చేసిన విన్నపాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అన్ని రాష్ట్రాల రవాణా మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో మూడు ప్రధాన అంశాలను మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకారం కోరనున్నారు. ప్రధానంగా ఏటీఎ్‌సల ఏర్పాటు, పదిహేనేళ్లు దాటిన వాహనాలను గుజిరీకి వేయడం, వాటి యజమానులకు కొత్త వాహనాల కొనుగోలులో పదిశాతం రాయితీ, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ ఎలక్ట్రికల్ ద్వారా పాస్ అయితేనే లైసెన్స్ జారీ, వాహన్ పరివాహన్‌లో సమస్యలపై రామ్ ప్రసాద్ రెడ్డి చర్చించనున్నారు. రాష్ట్రంలో కోటిన్నరకుపైగా వాహనాలు ఉండటంతో రవాణా శాఖ 63 ఫిట్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఏటీఎ్‌సలను ఏర్పాటు చేయాల్సిందేనని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తేవడంతో ఏపీలో జిల్లాకొకటి చొప్పున 25 ఏటీఎ్‌సల ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనిపై ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి విద్యాసంస్థల వాహనాల నిర్వాహకులు, లారీ యజమానుల వరకూ ఇబ్బందులు వ్యక్తం చేశారు.
వాహన ఫిట్నెస్ కోసం జిల్లా కేంద్రానికి వెళ్లడం కష్టంగా ఉందని, ఇటీవల శ్రీశైలంలో వాహనదారులు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి విజ్ఞప్తి చేశారు. 200 కి.మీ. దూరంలోని నంద్యాలకు వెళ్లాలంటే ఆ రోజు ఇక తిరిగి రాలేమని, శ్రీశైలంలో ఒక ఎఫ్‌సీ ఏర్పాటు చేయించాలని కోరారు. లేదా ఆత్మకూరులో కొనసాగించినా కొంత ఫలితం ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాలోనూ రాయదుర్గం, బొమ్మనహల్, డీ హీరేహల్ నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లాలంటే ఒక రోజు కుదరని పని. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోవాలాలు ఎఫ్‌సీ చేయించుకోరని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య ప్రధానంగా వినిపిస్తుండటంతో కనీసం 100 వరకూ డీఎల్, ఎఫ్‌సీ కోసం ఆఫీసులు ఏర్పాటు చేయాలని రవాణా అధికారులు మంత్రికి తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో 250 కేంద్రాలకు అనుమతి ఉందని, 150 కేంద్రాలు పని ప్రారంభించాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమస్యను పలువురు వాహన యజమానులూ మంత్రి దృష్టికి తీసుకురావడంతో కేంద్రాన్ని సాయం కోరనున్నట్లు తెలిసింది.
రోజుకు 24 మించి ఇవ్వలేమంటున్న ఎంవీఐలు
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఏటీఎ్‌సలలో 43 పరీక్షలు చెయ్యాలని, వాటిలో చూసి పరిశీలించేవి 29 ఉన్నాయని, అవన్నీ చేయాలంటే రోజుకు(ఎనిమిది గంటల్లో) 20 నుంచి 24 వాహనాలకు మించి ఎఫ్‌సీ ఇవ్వలేమని ఎంవీఐలు చెబుతున్నారు. భారీ వాహనానికి 43 నిమిషాలు, చిన్న వాహనానికి 15 నిమిషాలు పడుతోందని, జిల్లా నలుమూలల నుంచి వాహనాలు ఒకే కేంద్రానికి వస్తే రోజుకు ఎన్ని చెయ్యగలమని ప్రశ్నిస్తున్నారు.
ఎక్కువ సెంటర్ల ఏర్పాటే ఏకైక పరిష్కార మార్గమని స్పష్టం చేస్తున్నారు. మే 15 నుంచి జూన్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన 33 వేల వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం ఈ 26 ఏటీఎ్‌సలతో ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని మంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
కనీసం 63 చోట్ల ప్రభుత్వమే సొంతంగా ఏటీఎ్‌సల ఏర్పాటుకు సహకారం అందించాలని, రోడ్ సేఫ్టీ ఫండ్ నుంచి రూ.200 కోట్లు మంజూరు చేయాలని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కేంద్రానికి విన్నవించబోతున్నారు. ఇటీవల కర్ణాటకలో పర్యటించిన అనుభవాలను వివరించి అక్కడ ఏటీఎ్‌సల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉపయోగకరమో వివరించనున్నట్లు తెలిసింది. అలాగే, కాలం చెల్లిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుకు ఇచ్చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే ఇచ్చే పది శాతం రాయితీలో అక్రమాలు జరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. పదిహేనేళ్ల క్రితం కొన్న మారుతి 800ను గుజిరీకి ఇచ్చేసి ఇప్పుడు ఇన్నోవా లేదా ఫార్చూనర్ కొనుగోలు చేస్తే ఆ పాత కారు కన్నా కొత్త కారుపై ఇచ్చే రాయితీ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది. చిన్న, మధ్య, లగ్జరీ కార్లను పరిగణనలోకి తీసుకుని రాయితీ నిర్ణయించాలని రాష్ట్ర రవాణా అధికారులు కోరనున్నారు. అలాగే, వాహన్ పరివాహన్ ద్వారా ఎదురవుతోన్న సమస్యలు, ఎలక్ర్టిక్ డ్రైవింగ్ టెస్ట్ ద్వారా లైసెన్స్‌ల జారీలో ఇబ్బందులనూ ఢిల్లీలో జరిగే సమావేశంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రస్తావించనున్నట్లు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి.