Share News

Annamaiah District : భక్తులపై ఏనుగుల దాడి

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:03 AM

శివరాత్రి పర్వదినాన ఆ శివయ్యను దర్శించుకుందామని బయలుదేరిన భక్తులపై ప్రశాంతమైన ప్రకృతి.. పగబట్టినట్లు పంజా విసిరింది!

Annamaiah District : భక్తులపై ఏనుగుల దాడి

  • తలకోన అడవిలో అర్ధరాత్రి బీభత్సం.. ముగ్గురి దుర్మరణం.. నలుగురికి గాయాలు

  • శివరాత్రి ఉత్సవాలకు అడ్డదారిలో వెళ్తుండగా విషాదం.. స్టీల్‌ బాక్సుపై శబ్దం చేయడంతో రెచ్చిపోయి దాడి.. మృతుల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు

  • కొడుకు పుట్టడంతో తలనీలాలిద్దామని వెళ్తూ మృత్యువాత.. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

  • ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్ర్భాంతి

రైల్వేకోడూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): శివరాత్రి పర్వదినాన ఆ శివయ్యను దర్శించుకుందామని బయలుదేరిన భక్తులపై ప్రశాంతమైన ప్రకృతి.. పగబట్టినట్లు పంజా విసిరింది! అసలే అడవి.. ఆపై అర్ధరాత్రి.. ఏనుగుల భీకర గర్జనలతో భూమి కంపించింది.. తలకోనకు నడచి వెళుతున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో ముగ్గురు భక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. నలుగురు గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలో ఉన్న గుండాలకోన నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలోని శేషాచల అడవిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘోర విపత్తు చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడు అరుంధతివాడ, కన్నెగుంట గిరిజన కాలనీలకు చెందిన భక్తులు 30 మంది తిరుపతి జిల్లా నెరబైలు సమీపంలో ఉన్న తలకోనలోని శ్రీసిద్ధేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన సోమవారం రాత్రి 7 గంటలకు శేషాచలం అడవిలోని అడ్డదారిలో బయలుదేరారు. రాత్రి 2 గంటల సమయంలో గుండాలకోనకు 4కిమీ దూరంలో ఏనుగుల మంద తారసపడింది. శబ్దం చేస్తే వెళ్లిపోతాయన్న ఉద్దేశంతో 30 మందిలో ఒకరు స్టీలు టిఫిన్‌ బాక్సుతో శబ్దం చేయడంతో ఆగ్రహంతో ఏనుగులు ఒక్కసారిగా భక్తులపై దాడి చేశాయి. దీంతో చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు తీశారు. ఏనుగుల దాడిలో ఉర్లగట్టుపోడుకు చెందిన పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వంకాయల దినేశ్‌ (34) మృతి చెందాడు. ఇతడికి పది రోజుల క్రితమే కొడుకు పుట్టడంతో తలనీలాలు ఇచ్చేందుకు వెళుతూ మృత్యువాతపడ్డాడు.


అలాగే కన్నెగుంట గిరిజన కాలనీకి చెందిన తుపాకుల మణెమ్మ(40), తిరుపతి చెంగల్రాయుడు(35)లను ఏనుగులు తొక్కి చంపేశాయి. ఉర్లగట్టుపోడు అరుంధతివాడకు చెందిన పలిగిల రాజశేఖర్‌, వెం కట సుబ్బయ్య, వెంకట రత్నమ్మ, కన్నెగుంట గిరిజనకాలనీ కి చెందిన అమ్ములు అలియాస్‌ పాపమ్మ గాయపడ్డారు. అటవీశాఖ, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించారు.

ఏనుగుల కదలికలను ట్రాక్‌ చేయండి

మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకు తగిన భద్రత కల్పించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డీఎ్‌ఫవోలతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఏనుగుల కదలికలను ట్రాక్‌ చేయడానికి రేడియో కాలరింగ్‌, ఇతర ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.

పొదలో దాక్కున్నా..

తలకోనలో శివయ్యను దర్శించుకోవడానికి నడిచివెళ్తుండగా సోమవారం రాత్రి 7 గంటలకు కాలినడక ప్రారంభించాం. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దట్టమైన అడవిలో ఏనుగులు తారసపడ్డాయి. అందరం పొదలోకి వెళ్లి దాక్కున్నాం. నా కుమార్తె అమ్ములు (అలియాస్‌ పాపమ్మ) కాలు బయట ఉండడంతో ఆ కాలును ఏనుగు తొక్కింది. దీంతో నా భార్య మణెమ్మ కేకలు పెట్టింది. దీంతో ఏనుగుల మంద ఒక్కసారిగా మీదపడి తొక్కేయడంతో నా భార్య మణెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. నా కుమార్తె కాలు విరిగి ఉంది. దిక్కు తోచక బిక్కుబిక్కుమంటూ తెల్లవారిందాకా ఉండాల్సి వచ్చింది.

- సిద్ధయ్య, ప్రత్యక్ష సాక్షి, కన్నెగుంట గిరిజన కాలనీ


బాధిత కుటుంబాలకురూ.10 లక్షల చొప్పున అందజేత

ఏనుగుల దాడిలో మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం ప్రభుత్వం ద్వారా అందించాలని స్థానిక అటవీశాఖాధికారులను ఆదేశించారు. వెంటనే వెళ్లి బాధితులను పరామర్శించాలని పవన్‌ ఆదేశించడంతో.. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసెంబ్లీ సమావేశాల నుంచి వెంటనే వెనుదిరిగి వచ్చి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కులు పంపిణీ చేశారు.


For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 26 , 2025 | 04:03 AM