Share News

SIT Investigation: వీరే ప్రధాన కుట్రదారులు

ABN , Publish Date - May 18 , 2025 | 03:30 AM

మద్యం కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రధాన కుట్రదారులుగా సిట్ అభిప్రాయపడింది. ప్రతి నెలా రూ.50-60 కోట్లు ముడుపులు వసూలు చేసి, మాజీ సీఎం జగన్‌కు చేరేలా స్కెచ్ వేశారని తెలిపింది.

SIT Investigation: వీరే ప్రధాన కుట్రదారులు

  • జగన్‌కు ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సన్నిహితులు

  • ఈ ఇద్దరి ద్వారానే అసలు వ్యక్తికి మద్యం ముడుపులు

  • నెలకు 50-60 కోట్ల కమీషన్ల వసూలుకు పక్కా స్కెచ్‌

  • స్కామ్‌ అమలుకు డిప్యుటేషన్‌పై వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌

  • ధనుంజయ్‌రెడ్డి సూచనతోనే వారిద్దరికి కీలక పోస్టులు

  • ‘లిక్కర్‌’ సంప్రదింపులు జరిపింది కృష్ణమోహన్‌రెడ్డి

  • రాజ్‌ కసిరెడ్డి నుంచి వీరికి ముడుపుల మూటలు

  • అంతిమ లబ్ధిదారుకు భారీవాటా..వీరికీ సొంత లబ్ధి

  • రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించిన సిట్‌ అధికారులు

  • కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరిన సిట్‌

  • రిమాండ్‌ విధించిన కోర్టు.. బెజవాడ జైలుకు తరలింపు

అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు, సీఎంవోలో కీలక వ్యక్తులైన ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ద్వారానే ముడుపులు అసలువ్యక్తులకు చేరాయని ఏసీబీ కోర్టుకు సిట్‌ అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారుల నుంచి కమీషన్లను ఏ1 రాజ్‌ కసిరెడ్డి వసూలు చేసేవారని, ఆ సొమ్ములు ఆయన నుంచి ఎక్కడికి చేరాయనేది వీరిద్దరికీ తెలుసునని పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌లో ఈ ఇద్దరూ ప్రధాన కుట్రదారులని తెలిపారు. రాజ్‌ కసిరెడ్డి కార్యాలయానికి కారులో తరచూ వెళ్లి మద్యం సొమ్ములు తెచ్చుకునేవారని వెల్లడించారు. ముడుపులను తెచ్చుకోవడంలో మరో ముఖ్య నిందితుడు, జగన్‌ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప సహా ముగ్గురూ పోటీపడేవారని చెప్పారు. కానీ, విచారణలో ఆ విషయాలేవీ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి బయటపెట్టలేదని వారి రిమాండ్‌ రిపోర్టులో ‘సిట్‌’ వెల్లడించింది. మద్యం స్కామ్‌లో రిటైర్డు ఐఏఎస్‌ అధికారి, సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి (ఏ31) జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి(ఏ32)ని శుక్రవారం సిట్‌ అధికారులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టులో శనివారం వారిని ప్రవేశ పెట్టిన సిట్‌ అధికారులు అరెస్టు ఎందుకు చేశారో రిమాండ్‌ రిపోర్టులో కోర్టుకు వివరించారు.


దందాలో కీలకం..

రిమాండ్‌ రిపోర్టును అనుసరించి.. భారతదేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ పాలనలో జరిగింది. మద్యం పాలసీని స్వప్రయోజనాలకు అనువుగా రూపొందించడం దగ్గర నుంచి ఉత్పత్తి, సరఫరా, బ్రాండ్లు, విక్రయాలు, కమీషన్ల వసూలు, అంతిమంగా ప్రధాన లబ్ధిదారుకు చేర్చడం వరకూ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ప్రతి చోటా ఉన్నారు. 2019 ద్వితియార్థంలో లిక్కర్‌ పాలసీ రూపొందించడం నుంచి కమీషన్ల వసూలు వరకూ ఏది ఎలా ఉండాలనే విషయమై ఇతర నిందితులతో జరిగిన సమావేశాల్లో వారు పాల్గొన్నారు. ఈ సమావేశాలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు వెనుక ఉన్న ఇంట్లోనూ.. విజయవాడ ఎలమంచిలి హైట్స్‌లోని మూడో అంతస్తులోనూ తరచూ జరిగేవి. ప్రభుత్వమే మద్యం విక్రయాలు జరిపేలా పాలసీ రూపొందించిన తర్వాత ఏ బ్రాండ్లు విక్రయించాలి.. ఏవి అణగ దొక్కాలి.. అనే బాధ్యత చూసుకోవడానికి డిప్యుటేషన్‌పై కొందరిని ఏపీకి తెచ్చి కీలక స్థానాల్లో నియమించారు. అలా కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాసుదేవ రెడ్డిని, ఏపీ అబ్కారీ శాఖ అధికారి సత్య ప్రసాద్‌ను ధనుంజయ్‌ రెడ్డి సూచనతోనే రాష్ట్రానికి తెచ్చారు. ఆ తర్వాత మద్యం బ్రాండ్లు అనుకున్నట్లు వెళుతున్నాయా...ప్రతి వారం కలెక్షన్లు వస్తున్నాయా... ఏపీఎ్‌సబీసీఎల్‌ బిల్లు ఇచ్చిన వెంటనే నగదు రూపంలో మద్యం వ్యాపారులు కమీషన్లు అనుకున్నంత ఇస్తున్నారా...అనే పర్యవేక్షణ జగన్‌ కుటుంబంతో సన్నిహితంగా ఉండే ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డే పర్యవేక్షించారు. రాజ్‌ కసిరెడ్డి కార్యాలయానికి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరచూ వెళ్లి కార్ల డిక్కీల్లో నగదు సంచులు పెట్టుకుని వచ్చేవారు. ప్రధాన లబ్ధిదారుకు చేర్చాల్సిన సింహభాగం చేర్చేసి వారిద్దరు భారీగానే లబ్ధి పొందారు. ఐదేళ్లలో మూడున్నర వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ సిండికేట్‌లో మాజీ సీఎం కార్యదర్శి, ఓఎస్డీతోపాటు బాలాజీ గోవిందప్ప ముఖ్యులు.


ఈ కేసులో ఇతర నిందితులు, సాక్షులు, ఎక్సైజ్‌ అధికారులు, మద్యం వ్యాపారులను విచారించాం. వారిలో మెజారిటీ వ్యక్తుల వేళ్లు ఈ ముగ్గురి వైపే చూపించాయి. రాజ్‌ కసిరెడ్డి నుంచి ఈ ముగ్గురే తరచూ డబ్బులు తీసుకెళ్లే వారని క్యాష్‌ హ్యాండ్లర్స్‌లో కీలక వ్యక్తి బూనేటి చాణక్య వెల్లడించారు. దీనిపై ఆధారాలతో సహా ప్రశ్నించినా ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఏ మాత్రం సహకరించలేదు. ప్రతి నెలా యాభై నుంచి అరవై కోట్ల రూపాయల మద్యం ముడుపులు వసూలు చేసిన ఈ వ్యక్తులు అత్యంత శక్తివంతులు. వీరు బయట ఉంటే విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున అరెస్టు చేశాం. ఈ కుంభకోణంలో ఈ ఇద్దరిని విచారించి మరిన్ని కీలక అంశాలు వెలికి తీయాల్సి ఉందని కోర్టుకు సిట్‌ తెలిపింది.

కమీషన్‌ రాజ్‌ నడిపారు..

మద్యం బ్రాండు, నాణ్యతతో సంబంధం లేకుండా ఎవరు కమీషన్లు ఇస్తే వారికి ఆర్డర్లు ఇచ్చారని సిట్‌ తన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. అలా చేసేందుకే తన మనుషులను ఏపీఎ్‌సబీసీఎల్‌లో ధనుంజయ్‌ రెడ్డి నియమించుకున్నారని వెల్లడించింది. ఈ వ్యవహారంలో ధనుంజయ్‌ రెడ్డి రూ. వందల కోట్లు గడించి, ఆ సొమ్ముతో ఆస్తులు, విలాసవంతమైన వాహనాలు కొన్నారని స్పష్టంచేసింది. మరోవైపు ఇదే సిండికేట్‌లో కీలకంగా వ్యవహరించిన కృష్ణమోహన్‌ రెడ్డి లిక్కర్‌ బ్రాండ్ల ఎంపిక, సరఫరాదారులతో సంప్రదింపులు చేపట్టేవారు. తన పాత్ర తాను పోషించి తాను తీసుకున్న సొమ్మును రియల్‌ ఎస్టేట్‌, బులియన్‌ మార్కెట్లలో ఆయన పెట్టారని తెలిపింది.

Updated Date - May 18 , 2025 | 03:33 AM