Tirumala: బ్రేక్ దర్శనాలపై మల్లగుల్లాలు!
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:04 AM
తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల తాకిడి మొదలవ్వడంతో టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది.
ఇప్పటికే రోజుకు 7500.. ఇప్పుడు టీ-ప్రజాప్రతినిధుల లేఖల ఒత్తిడి
ఎక్కడ తగ్గించాలి.. ఎలా సర్దుబాటు చేయాలి?.. టీటీడీ ఉక్కిరిబిక్కిరి
(తిరుమల-ఆంధ్రజ్యోతి)
తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల తాకిడి మొదలవ్వడంతో టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే రోజురోజుకూ పెరిగిపోతున్న బ్రేక్ టికెట్ల సంఖ్యను ఎలా తగ్గించాలనే ఆలోచనలో తలమునకలై ఉన్న టీటీడీకి.. తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మరోవైపు, తెలంగాణ సీఎం అభ్యర్థన మేరకు బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చేందుకు ఏపీ సీఎం అంగీకారం తెలిపినా టీటీడీ మాత్రం తమ సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర నేతలు గుర్రుమంటున్నారు. టోకెన్ రహిత దర్శనాలతో పాటు వివిధ రకాల టికెట్లు కలిగిన భక్తులు నిత్యం 60 వేల నుంచి 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్న విషయం తెలిసిందే. వారాంతాల్లో ఆసంఖ్య లక్షకు వరకూ చేరుతోంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఏపీ ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2 వేల వరకు బ్రేక్ దర్శనాలకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వీరితో పాటు పోలీసు, ప్రెస్, న్యాయవ్యవస్థ, ఇన్‌కమ్‌ట్యాక్స్, ఐఏఎస్, టీటీడీ ఉద్యోగులు, కేంద్రమంత్రులు, సీఎంవోలు.. ఇలా మరో వెయ్యి నుంచి 1,500, టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులకు 580, స్వయంగా వచ్చే వీఐపీలు, టీటీడీ అధికారులు, దాతలకు కలిపి మరో 600 టికెట్లు, శ్రీవాణిట్రస్టుకు విరాళాలిచ్చే భక్తులకు 1,500 బ్రేక్ టికెట్లు ఇస్తున్నారు. ఇలా వీఐపీ బ్రేక్ దర్శనాలు రోజుకు దాదాపు 7 వేల నుంచి 7,500 వరకు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం వీరందరికీ దర్శనం చేయించడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సిఫారసు లేఖలపై సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం, మరో రెండు రోజులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ప్రభుత్వం నుంచి టీటీడీకి ఆదేశాలు అందాయి. అయితే ఇప్పటికే పెరిగిన బ్రేక్ దర్శన సిఫారసులను ఎక్కడ తగ్గించాలో అర్థంకాక టీటీడీ అధికారులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సిఫారసు లేఖలతో వస్తున్న తెలంగాణ భక్తులు ‘మాలెటర్లు ఎందుకు తీసుకోరు. ప్రభుత్వం ప్రకటన చేసింది కదా’ అంటూ వాగ్వాదాలకు దిగుతున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై దర్శనాలు ఇవ్వడం ప్రారంభిస్తే మరో 1,100 టికెట్లు పెరుగుతాయి. ఫలితంగా మరో గంట సమయం వీఐపీలకు కేటాయించాల్సి వస్తుంది.
ఆరు బ్రేక్ దర్శన టికెట్లు రూ.33 వేలు!
వైసీపీ ఎమ్మెల్సీ లేఖపై టికెట్లు పొంది విక్రయించిన దళారీ
వైసీపీ ఎమ్మెల్సీ సిఫారసు లేఖపై తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లను రూ.33 వేలకు విక్రయించి అక్రమానికి పాల్పడ్డాడో దళారీ. విజిలెన్స్ వింగ్ అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన కమల్.. తమ కుటుంబంలోని ఆరుగురికి బ్రేక్ దర్శనాలు కావాలని తిరుపతికి చెందిన దామోదరం అనే దళారీని సంప్రదించారు. అందుకు ఆ దళారీ రూ.30 వేలు డిమాండ్ చేయగా, ముందుగా రూ.20 వేలు ఆన్‌లైన్ ద్వారా పంపారు. దీంతో దామోదరం వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ సిఫారసు లేఖతో ఆ ఆరుగురికి సోమవారం దర్శనం కోసం ఆదివారం అదనపు ఈవో కార్యాలయంలో లేఖ సమర్పించారు. టికెట్ల కోనుగోలు కోసం కూడా భక్తుల నుంచి దళారీ మరో రూ.3 వేలు వసూలు చేశారు. ఆ టికెట్లతో సోమవారం దర్శనానికి వచ్చిన భక్తులను విజిలెన్స్ వింగ్ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయింది. విజిలెన్స్ ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.