Share News

Tirumala Lab : టీటీడీలో కల్తీ నెయ్యికి కళ్లెం!

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:11 AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేలా నూతన పరికరాలతో టీటీడీ ల్యాబ్‌ సిద్ధమైంది.

Tirumala Lab : టీటీడీలో కల్తీ నెయ్యికి కళ్లెం!

  • 100% కల్తీని గుర్తించే నూతన పరికరాలు సిద్ధం

  • జర్మనీ నుంచి 70 లక్షల విలువైన 2 యంత్రాలు

  • తిరుమల ల్యాబ్‌కు విరాళంగా ఇచ్చిన ఎన్డీడీబీ

తిరుమల, జనవరి 18(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేలా నూతన పరికరాలతో టీటీడీ ల్యాబ్‌ సిద్ధమైంది. లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కల్తీపై ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2024 జూలై 8న నమూనాలు ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్‌ ల్యాబ్‌కు పంపగా, అదేనెల 17న ఈ మేరకు నివేదిక రావడం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తిరుమలలోని ల్యాబ్‌కు నెయ్యిని వందశాతం పరీక్షించే సామర్థ్యం లేదని, అక్కడ ఉన్న యంత్రాలతో మాయిశ్చరైజ్‌, కెమికట్‌ అనాలసిస్‌, ఆర్‌ఐ(రిఫ్రాక్ట్‌ ఇండెక్స్‌) వంటి ప్రాథమిక పరీక్షలు మాత్రమే చేయగలమని పలువురు నిపుణులు నివేదిక ఇచ్చారు. దీంతో ఇక్కడి ల్యాబ్‌లో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు టీటీడీ ఈవో శ్యామలరావు నిర్ణయించారు. నెయ్యిని సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు కావాల్సిన యంత్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం ఫ్యాటీ ఆసిడ్‌ మైథెల్‌ ఎస్టర్‌, బీటా-సిటోస్టెరాల్‌ వంటి పరీక్షలకు గ్యాస్‌ క్రోమాటోగ్రాఫ్‌ (జీసీ), హై ఫెర్ఫార్మన్స్‌ లిక్విడ్‌ క్రోమాటోగ్రాఫ్‌ (హెచ్‌పీఎల్‌సీ) అనే రెండు యంత్ర పరికరాలు అవసరమని నేషనల్‌ ల్యాబ్‌ నిపుణులు టీటీడీకి సూచించారు. దాదాపు రూ.70 లక్షల విలువైన ఈ రెండు పరికరాలను విరాళంగా ఇచ్చేందుకు నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డ్‌ (ఎన్‌డీడీబీ) అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో వీటిని ఇటీవల జర్మనీ నుంచి తిరుమలకు తీసుకువచ్చి ల్యాబ్‌లో అమర్చారు. వీటిద్వారా నెయ్యి నమూనాలను పరీక్షించేందుకు ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. దీంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాడర్డ్స్‌ రెగ్యులేషన్‌ (ఎఫ్ఎస్ఎస్ఆర్‌) నిబంధనల ప్రకారం నెయ్యిని పూర్తిస్థాయిలో పరీక్షించే స్థాయికి టీటీడీ ల్యాబ్‌ వచ్చింది. వచ్చేనెల నుంచి ఈ ల్యాబ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా టీటీడీ సన్నాహాలు చేస్తోంది.

Updated Date - Jan 19 , 2025 | 04:11 AM