అభాగ్యులకు వెంకన్న దర్శన భాగ్యం
ABN , Publish Date - Jan 26 , 2025 | 07:47 AM
జీవితంలో ఓసారైనా తిరుమల గోవిందుడిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. మరి దివ్యాంగులు, ఆర్థిక స్తోమత లేని పేదల మాటో. అలా బాధపడే వృద్ధులు, దివ్యాంగులు, అంధులు, బధిర, మూగ, నిరుపేదలకు ఓ ఛారిటబుల్ ట్రస్టు వరంగా మారింది.
జీవితంలో ఓసారైనా తిరుమల గోవిందుడిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. మరి దివ్యాంగులు, ఆర్థిక స్తోమత లేని పేదల మాటో. అలా బాధపడే వృద్ధులు, దివ్యాంగులు, అంధులు, బధిర, మూగ, నిరుపేదలకు ఓ ఛారిటబుల్ ట్రస్టు వరంగా మారింది. ఆర్థికస్తోమత, సహకారం, తోడులేని అనేకమందికి స్వామి దర్శనాన్ని కల్పిస్తూ విశేష సేవలందిస్తున్నారు వేణుకుమార్ చుక్కల. ఆ విశేషాలే ఇవి...
హైదరాబాద్ యాప్రాల్‌లో ‘గరుడ బ్యాడ్మింటన్ అకాడమి’ నడుపుతున్నారు వేణుకుమార్. 1996లో ఆయనకు కలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనమిచ్చి ‘నువ్వు నా కొండకు రావాలి. పేదలను తీసుకువచ్చి నా దర్శనం చేయించాలి. ఓ ఆలయాన్ని కట్టించి సేవ చేయాలి’ అని సూచన చేశారట. అంతే... అప్పటి నుంచి తిరుమల కొండకు కాలినడకన రావడం మొదలెట్ట్టారు.
అలా మొదలయ్యింది...
ఈక్రమంలోనే భారత మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ 108 సార్లు కొండకు కాలినడకన వచ్చారనే వార్త చదివి ‘నేనేందుకు 108 సార్లు కొండెక్కకూడదు’ అని మనసులో అనుకుని 2013 నాటికి 107 సార్లు పూర్తిచేశారు. అప్పటివరకు తనతో నడిచి వచ్చిన వారందరిని కూడా 108వ సారి తిరుమలకు తీసుకురావాలని నిర్ణయించుకుని 275 మంది బృందంతో సంకల్పాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా కాలినడకను కొనసాగించారు. ఈ క్రమంలో చాలామంది భక్తులు వచ్చిన వారే వస్తున్నారు తప్ప, కొత్తగా వచ్చేవారు చాలా తక్కువగా ఉన్నారని గ్రహించారు.

అందుకే ‘ఇప్పటివరకు స్వామి దర్శనానికి రాని నిరుపేదలను తిరుమలకు తీసుకువచ్చి దర్శనం చేయించాల’ని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ‘శ్రీ అష్టోత్తర(108) శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు. 2014లో తన పుట్టినరోజు సందర్భంగా తొలిసారిగా 39 మంది నిరుపేదలను తిరుమలకు తీసుకు వచ్చారు. అప్పటి నుంచి తమ జీవితంలో తిరుమల దర్శనాన్ని ఊహించని నిరుపేదలు, బదిర, అంధ, మూగ, దివ్యాంగులు, వృద్ధులను... వలంటీర్ల సహకారంతో తిరుమలకు తీసుకురావడం ఆయనకు అలవాటుగా మారింది. ఇందుకోసం ఆయన పేపర్‌లో ప్రకటన కూడా ఇస్తుంటారు. శిక్షణ ఇచ్చిన వలంటీర్లు, వైద్యుల ఆధ్వర్యంలో సురక్షితంగా స్వామి దర్శనం చేయిస్తున్నారు. రవాణా, వసతి, భోజనం వంటి అన్ని సదుపాయాలను ట్రస్టు ద్వారా ఉచితంగానే అందజేస్తారు.
పలువురి ప్రశంసలు...
తిరుమలకు ప్రతీరోజూ కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. అయితే పేదలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం అన్ని ఖర్చులు భరించి, వారికి దర్శనభాగ్యం కల్పిస్తున్న వేణుకుమార్ సేవల గురించి తెలుసుకుని చాలామంది ప్రముఖులు ఆయనను అభినందించారు. వారిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, మఠాధిపతులు, పీఠాధిపతులున్నారు.

2,600 మందికి దర్శన భాగ్యం
2015లో తమ ట్రస్టు ద్వారా వచ్చిన వారికి దర్శనం, వసతి, ప్రసాదాలు వంటి ఏర్పాట్లు చేయాలనే వేణుకుమార్ విజ్ఞప్తి మేరకు అప్పటి దేవాదాయ శాఖ అధికారులు టీటీడీకి లేఖ రాశారు. అప్పట్లో ఈ విశేష కార్యక్రమం ఏపీ ప్రభుత్వాన్ని కదిలించింది. మనం కూడా ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించ కూడదనే ఆలోచన కలిగింది ప్రభుత్వానికి. అందులో భాగంగానే 2016లో 13 జిల్లాల నుంచి దాదాపు 1.30 లక్షల మందికి ‘దివ్యదర్శనం’ పేరుతో ప్రభుత్వమే నిరుపేదలు, వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు దర్శనం చేయించింది.

అప్పటి నుంచి కొవిడ్ వరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగింది. ‘మీ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ’ంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంస వేణుకుమార్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు పేదలు, దివ్యాంగులతో తిరుమలకు వచ్చి, 2,600 మందికిపైగా దర్శనభాగ్యం కల్పించారు. అలాగే వ్యక్తిగతంగా 350వసారి కాలినడకన తిరుమలకు చేరుకున్న రికార్డు ఆయనకుఉంది.
- జగదీష్ జంగం, తిరుమల
ఆ స్వామి కోసం...
దేశవ్యాప్తంగా కోట్లాది మంది దివ్యాంగులున్నారు. స్వామిని చూడాలనే కోరిక వారిలో ఉన్నా తీసుకువచ్చేవారు లేరు. అలాగే పేదవారితో పాటు అనాఽథలు, బధిరులు, అంధులు, మూగ వంటి ప్రత్యేక ప్రతిభావంతులు అనేకమంది ఉన్నారు. వారందరికీ దర్శనం చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇప్పటికే ఏపీ, తెలంగాణతో పాటు షోలాపూర్, పుణే వంటి ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులను సైతం దర్శనానికి తీసుకువచ్చా. నా స్నేహితులు, తెలిసినవారు ఆర్థికసాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ‘నడునడు వెంకన్న కడవరకు దివ్యాంజన్ దివ్యదర్శన్’, ‘ఛలోఛలో బాలాజీకి పాస్‌కే ఛలో దివ్యాంజన్ దివ్యదర్శన్’ అనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇక, నా సంకల్పం 1,008 సార్లు తిరుమలకు కాలినడకన రావడం పూర్తయిన తర్వాత నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ఆలయం కట్టిస్తాను. తిరుమల దర్శనం చేసుకోవాలనుకునే నిరుపేదలు, దివ్యాంగులు ఎవరైనా 96661 59999 నెంబరుకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
- వేణుకుమార్ చుక్కల, ట్రస్టు స్థాపకులు