Share News

Manasarovar Yatra: నేపాల్‌లో ఆందోళనలు.. చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:19 PM

నేపాల్ ఆందోళనల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆ దేశ సరిహద్దులను మూసివేశారు. ఈ నేపథ్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు.

Manasarovar Yatra: నేపాల్‌లో ఆందోళనలు.. చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
Telugu pilgrims stranded china nepal border

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: జెన్ జెడ్ ఆందోళనలతో నేపాల్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో నేపాల్ మార్గం ద్వారా మానస సరోవర యాత్రకు వెళ్లిన తెలుగు వారు చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. దాంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలో తమను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలంటూ వీడియో సందేశాన్ని వారి బంధువులకు పంపారు. తాము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామంటూ వారు.. ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.


ఆగస్టు 2వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 21 మంది విశాఖపట్నం నుంచి మానస సరోవర్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే ఈ యాత్ర పూర్తయిన అనంతరం తిరుగు ప్రయాణంలో వీరంతా నేపాల్ మీదుగా భారత్ చేరుకోవాల్సి ఉంది. కానీ నేపాల్‌లో అల్లర్ల కారణంగా చైనా సరిహద్దుల్లో వారిని టూర్ ఆపరేటర్ నిలిపి వేసినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు.


నేపాల్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఈ యాత్రికులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తమను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలంటూ ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్జప్తి చేశారు. యాత్రికుల్లో విశాఖపట్నం వాసులు 8 మంది, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి 13 మంది ఉన్నారు. కైలాస్ వ్యూ టూర్స్ అండ్ ట్రెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా వీరంతా యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది.


Also Read:

Rahul Gandhi CRPF: రాహుల్ గాంధీ భద్రతా ప్రోటోకాల్‌ పాటించడం లేదు..

Who is Kulman Ghising: ఇంతకీ ఎవరీ కుల్మన్ ఘీసింగ్..

For More National News and Telugu News..

Updated Date - Sep 11 , 2025 | 06:47 PM