Share News

CM Chandrababu Naidu: 2 నుంచి జనంలోకి టీడీపీ

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:21 AM

తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం (29) జరుగనుంది. వచ్చే నెల 2 నుంచి ఇంటింటికీ మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే.

CM Chandrababu Naidu: 2 నుంచి జనంలోకి టీడీపీ

ఎల్లుండి విస్తృత స్థాయి సమావేశం

  • ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’పై సమగ్ర చర్చ

  • ప్రజలకు ఏమేం వివరించాలి,ఏడాది విజయాలపై బాబు దిశానిర్దేశం

  • జగన్‌ అరాచక పర్యటనలనూఎండగట్టాలని నిర్ణయం?

అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం (29) జరుగనుంది. వచ్చే నెల 2 నుంచి ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి.. ప్రజలకు ఏమేం వివరించాలన్న అంశాలను చర్చించడంతోపాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలపై సదరు సమావేశంలో అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.


ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొననున్నారు. ఏడాది పాలనపై ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఇప్పటికే కూటమి పార్టీలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు జూలై 2 నుంచి టీడీపీ శ్రేణులన్నీ ఇంటింటికీ తిరిగి ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తారని అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. పింఛన్ల పెంపు, తల్లికి వందనం కింద ఇంట్లోని ప్రతి బిడ్డకూ డబ్బులు వేయడం, అన్నదాతా సుఖీభవ, దీపం-2 కింద మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే.. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతిని గాడినపెట్టడం, పోలవరం పనులను వేగవంతం చేయడం, ఏడాదిలోనే రాష్ట్రానికి సుమారు 9.50 లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకురావడం వంటి అభివృద్ధి కార్యక్రమాలనూ చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు మార్గనిర్దేశం చేస్తారు. మరోవైపు.. కూటమి ఏడాది పాలనపై వైసీపీ కూడా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.


‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో కార్యక్రమం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వైసీపీని ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలనూ ప్రజలకు వివరించాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. తెనాలిలో గంజాయి బ్యాచ్‌కు జగన్‌ పరామర్శ, పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ పేరుతో వేల మందితో జనంపైనే దండయాత్ర చేయడం, మహిళలపై రాళ్ల దాడులు, సత్తెనపల్లిలో బెట్టింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైన మాజీ సీఎం తీరును ఎండగట్టాలని యోచిస్తోంది. ఈ అంశాలపై విస్తృతస్థాయి భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Updated Date - Jun 27 , 2025 | 05:21 AM