Share News

TDP: పనిచేసిన వారికే పదవులు

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:38 AM

నామినేటెడ్‌ పోస్టులన్నీ ఈ నెలాఖరుకు భర్తీచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను కూడా త్వరలో నియమిస్తామన్నారు.

TDP: పనిచేసిన వారికే పదవులు

  • నెలాఖరుకు నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

  • రెడ్‌ బుక్‌ తన పని చేసుకుపోతోంది: మంత్రి లోకేశ్‌

  • ఇసుక, లిక్కర్‌ కుంభకోణాల్లో త్వరలో కొందరు జైలుకు

తిరుపతి (విద్య)/ చంద్రగిరి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పోస్టులన్నీ ఈ నెలాఖరుకు భర్తీచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను కూడా త్వరలో నియమిస్తామన్నారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. గతంలో నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్న కేడర్‌కు గుర్తింపునిస్తామన్నారు. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో బుధవారం ఆయన చంద్రగిరి నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పనితీరు ఆధారంగా పదవులు ఇస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు. వచ్చే నెల నుంచి పార్టీకోసం అధిక సమయం కేటాయిస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలతో వాట్సాప్‌ ద్వారా టచ్‌లో ఉంటూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని, నాయకుల పనితీరుపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటానని చెప్పారు.


పొలిట్‌ బ్యూరోలో ప్రతి రెండేళ్లకూ 30 శాతం కొత్తవారు రావాలని, అప్పుడే పార్టీ ఉత్తేజంగా నడుస్తుందని చెప్పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి 164 సీట్లు ఇచ్చారని, మనం ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలని అన్నారు. అహంకారంగా మాట్లాడకూడదని దిశానిర్దేశం చేశారు. ‘రెడ్‌ బుక్‌ను నేను మర్చిపోలేదు. అది తనపని తాను చేసుకుపోతుంది. యువగళంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. తప్పు చేసినవారిని ఎవరినీ వదలే ప్రసక్తే లేదు. ఇసుక, లిక్కర్‌ కుంభకోణాల్లో చాలామంది త్వరలో జైలుకు వెళతారు’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు. అనవసరంగా కేసులు పెట్టడం మన విధానం కాదన్నారు. ‘ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో చేపట్టే కార్యక్రమంలో శ్రేణులు భాగస్వాములు కావాలి. మనం చేసింది చెప్పుకోవాలి. ప్రాధాన్య క్రమంలో బాబు సూపర్‌ 6 హామీలు నెరవేర్చి తీరుతాం. మెగా డీఎస్సీకి త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తాం. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాలు భర్తీచేస్తాం’ అని వివరించారు.


కూటమిలో మనది పెద్దన్న పాత్ర

‘కూటమి ప్రభుత్వంలో మనది పెద్దన్న పాత్ర. మిత్రధర్మంతో పనిచేస్తున్నాం. కొంతమంది ఆవేశంతో మాట్లాడినా ఓర్పుగా ఉండాలి. 1985 తర్వాత గెలవని మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచాం. నన్ను, చంద్రబాబును ఓడించడానికి వైసీపీ వారు మంగళగిరి, కుప్పంలో ఓటుకు రూ.4వేల చొప్పున రూ.150 కోట్లు ఖర్చుపెట్టారు’ అని లోకేశ్‌ అన్నారు. అన్నీ గమనించిన ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 04:38 AM