TDP MLA Thomas: తిరుమల ఆలయంలో టీడీపీ ఎమ్మెల్యే థామస్ తిట్లదండకం
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:12 AM
చిత్తూరుజిల్లా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్ తిరుమలలో ఆదివారం హల్‌చల్ చేశారు...
తన అనుచరులందరినీ ప్రొటోకాల్‌లో అనుమతించాల్సిందేనని డిమాండ్
తిరుమల, జూలై13(ఆంధ్రజ్యోతి): చిత్తూరుజిల్లా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్ తిరుమలలో ఆదివారం హల్‌చల్ చేశారు. ఆయన శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం ఈయనతోపాటూ మరో 9మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ జారీ చేసింది. అలాగే తనతో వచ్చిన మరో ఆరుగురికి వేరే రిఫరెన్స్‌లో సాధారణ వీఐపీ బ్రేక్ టికెట్లు పొందారు. అయితే వీరిని కూడా తనతో పాటూ క్యూకాంప్లెక్స్ 1లోని ప్రొటోకాల్ లైన్‌లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో టీటీడీ సిబ్బంది అనుమతించలేదు. వారితో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే ఆగ్రహంతో తిట్లకు దిగడమే గాక బలవంతంగా తన అనుచరులను నేరుగా ఆలయంలోకి తీసుకువెళ్లినట్టు తెలిసింది. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో డిప్యూటీఈవో, విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారిమీద కూడా ఎమ్మెల్యే థామస్ విరుచుకుపడినట్టు తెలిసింది. వివాదం పెద్దదవడంతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకి సర్దిచెప్పి పంపారు.