పిన్నెల్లి సోదరులను వదిలే ప్రసక్తే లేదు!
ABN , Publish Date - Jan 16 , 2025 | 04:41 AM
వైసీపీ నాయకులైన పిన్నెల్లి సోదరులను వదిలే ప్రసక్తే లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు.

రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చాలని పల్నాడు ఎస్పీకి బుద్దా వెంకన్న విజ్ఞప్తి
నరసరావుపేట లీగల్, విజయవాడ(వన్‌టౌన్), జనవరి 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులైన పిన్నెల్లి సోదరులను వదిలే ప్రసక్తే లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. మునిసిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మంగళవారం ఆయన నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. పిన్నెల్లి సోదరులు వేలం పాట పెట్టి.. వచ్చిన వారిని ఎవరు చంపుతారో వారికి లైఫ్ సెటిల్‌మెంట్ అని పిలుపునిచ్చారన్నారు.
దీంతో తనను, బొండా ఉమామహేశ్వరరావును చంపేందుకు తురకా కిషోర్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడన్నారు. కిషోర్ వెదురు బొంగుతో తమపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఆ దాడి చేయించింది పిన్నెల్లి సోదరులని, ఈ కేసులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేర్చాలని ఎస్పీని కోరారు. పిన్నెల్లిపై హైకోర్టులో ప్రైవేటు కేసు కూడా వేయబోతున్నానని తెలిపారు. ముందస్తు బెయిల్‌ను కూడా రద్దు చేసే విధంగా పోరాడతానన్నారు. మాచర్లకు ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నానని, దమ్ముంటే ఇప్పుడు తనపై దాడి చేయాలని పిన్నెల్లి సోదరులకు సవాల్ విసిరారు.