Share News

TDP Mahanadu 2025: నేటి నుంచే పసుపు పండుగ

ABN , Publish Date - May 27 , 2025 | 04:34 AM

కడపలో మూడు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తియ్యాయి. 23 వేల ప్రతినిధుల సమావేశంతో ప్రారంభమయ్యే ఈ మహాసభల్లో పార్టీ భావి కార్యాచరణపై చర్చించనున్నారు.

TDP Mahanadu 2025: నేటి నుంచే పసుపు పండుగ

  • కడపలో మహా సంబరానికి సర్వం సిద్ధం

  • మూడ్రోజుల మహానాడు కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు

  • మొదటి రోజు 23 వేల మంది ప్రతినిధులతో సభ

  • సంస్థాగత నిర్మాణం, భావి కార్యాచరణపై చర్చ

  • రేపు వివిధ తీర్మానాలపై సమాలోచనలు

  • ఏపీవి 14, తెలంగాణవి 5, ఉమ్మడి తీర్మానాలు 4

  • ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ

  • కడప చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌

  • ఇప్పటికే మంత్రులు, పలువురు నేతల మకాం

అమరావతి/కడప, మే 26 (ఆంధ్రజ్యోతి): కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. కర్నూలు-కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని రింగురోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో చేరుకోగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ కుప్పం నుంచి రోడ్డు మార్గాన వచ్చారు. నాలుగు రోజులుగా మంత్రుల బృందం కడపలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను చర్చించడంతోపాటు ప్రజాపాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. లోకేశ్‌ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌ను సవివరంగా చర్చించనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమవుతుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఇది మొదలవుతుంది. ఉదయం 10.30కు ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తారు. 10.30-10.45 వరకు రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. 10.45 నుంచి 11 గంటల వరకు పార్టీ అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.


జ్యోతిప్రజ్వలన, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి, తెలుగు తల్లి గీతాలాపన జరుగుతాయి. 11.10 నుంచి 11.20 వరకు మరణించిన కార్యకర్తలకు సంతాపం.. 11.20 నుంచి 11.30 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక, 11.30 నుంచి 11.45 వరకు రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. 23 వేల మంది పార్టీ ప్రతినిధుల సభలో సంస్థాగత నిర్మాణం, విధివిధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్‌ కార్యాచరణపై కేడర్‌కు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చిస్తారు. మాజీ మంత్రి యనమల కన్వీనర్‌గా ఉన్న మహానాడు తీర్మానాల కమిటీ కసరత్తు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 14 తీర్మానాలు ప్రతిపాదిస్తారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఐదు తీర్మానాలపైన, ఉమ్మడిగా నాలుగు తీర్మానాలపైన చర్చించి ఆమోదిస్తారు. అవసరాన్ని బట్టి తీర్మానాల సంఖ్య పెరిగే అవకాశముందని టీడీపీ వర్గాలు తెలిపాయి. చివరి రోజు గురువారం 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.


గతానికి భిన్నంగా కడపలో..

కడపలో నిర్వహించే మహానాడును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ సీఎం జగన్‌ జిల్లా కావడం, సీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా 45 అసెంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకోవడం, అన్నిటినీ మించి ఉమ్మడి కడప జిల్లాలో ఏడు స్థానాల్లో టీడీపీ కూటమి విజయంతో.. గతానికి భిన్నంగా ఈసారి కడపలో మహానాడు జరపాలని నిర్ణయించారు. ఏర్పాట్లకు వర్షం అడ్డంకిగా మారినా 19 కమిటీలు వేసుకుని పనులను యుద్ధ ప్రాతిపదికన చకచకా చే సేశారు. గత మహానాడుల కన్నా మించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం గమనార్హం. అతిథులకు సీమ వంటకాలతో విందు ఇస్తారు. 450 మంది కూర్చునే విధంగా వేదికను రూపొందించారు. పక్కనే సీఎంవో క్యాంపు ఆఫీసు, రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్‌, డైనింగ్‌, మీడియా పాయింట్‌, సమీపంలోనే 300 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. సోమవారం వర్షంతో ఏర్పాట్లకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

మంత్రుల బృందం బిజీబిజీ

మహానాడు ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. బహిరంగ సభకు జన సమీకరణపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, నారాయణ, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్‌, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య తదితర నేతలు కడప ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మహానాడులో క్లీనింగ్‌, బ్యూటిఫికేషన్‌ కార్యక్రమాలను మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ పరిశీలించారు. స్వచ్ఛ మహానాడు కార్యక్రమానికి డ్రెస్‌కోడ్‌ జాకెట్లు ధరించాలన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, నిమ్మల, స్వచ్ఛాంధ్ర చైౖర్మన్‌ పట్టాభిరాం, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ సత్యబాబు, పద్మరాజు ఈ కమిటీలో ఉన్నారు. భోజన వసతులపై మంత్రులు అనిత, అనగాని, సవిత, సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. కాగా మహానాడు బందోబస్తులో 5 వేల మంది పాల్గొంటున్నారు.


చంద్రబాబు, లోకేశ్‌లకు స్వాగతం

చంద్రబాబు రాత్రి 7.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టులో దిగారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌, కలెక్టర్‌, ఎస్పీ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన 8 గంటలకు మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక వద్ద మంత్రులు అనగాని, సవిత, నిమ్మల, ఎమ్మెల్యేలు పుత్తా చైతన్యరెడ్డి, పులివర్తి నాని తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్షించారు. జిల్లా పేరును వైఎ్‌సఆర్‌ కడపగా మార్చడంతో టీడీపీ నేతలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్‌ కుప్పం నుంచి రోడ్డు మార్గాన రాత్రి 8.50 గంటలకు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

టీడీపీ శ్రేణులతో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న హోటళ్లు, ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్లు, పైవేటు విద్యా సంస్థలన్నీ కిటకిటలాడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారితో కడప విమానాశ్రయం కూడా విమానాలతో బిజీ కానుంది. ఇక పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు సోమవారం కడపకు వచ్చి మహానాడు వేదిక వద్ద లోకేశ్‌ను కలిశారు.

ప్రతి మహానాడులో పాల్గొన్నా

ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చా. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రతి మహానాడుకూ హాజరయ్యాను. తెలుగుగంగ, గాలేరు-నగరి, గండికోట సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎన్టీఆర్‌ హయాంలో మొదలయ్యాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులను కొనసాగించడంతో పాటు దూరదృష్టితో ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. ఇప్పుడు టీడీపీలోకి రాబోయే కాలానికి కొత్తతరం నేతలు రావాలి. యువకుడు లోకేశ్‌ ఆధ్వర్యంలో యువతరం రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి.

- మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌


ఏపీ తీర్మానాలివీ..

1. ఎన్డీయే ప్రభుత్వం తొలి ఏడాది ఘనవిజయాలు.

2. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం(నదుల అనుసంధానం, బనకచర్లకు గోదావరి జలాలు)

3. ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ. (ప్రజారాజధాని నిర్మాణం. పట్టణ, గ్రామీణాభివృద్ధి, పెట్టుబడులతో వికేంద్రీకరణ. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు. జగన్‌ పాలనలో దోపిడీకి గురైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై దృష్టి)

4. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు.

5. మహిళ, యువత సంక్షేమానికి పెద్దపీట.

6. సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం.

7. కట్టుదిట్టంగా శాంతిభద్రతలు.

8. చంద్రన్న విజన్‌తో సంక్షేమ రాజ్యం. అన్ని వర్గాలకు ప్రాధాన్యం.

9. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేంద్రం తోడ్పాటు.

10. పేదరికం లేని సమాజ నిర్మాణ సంకల్పంతో ‘పీ-4’.

11. సాకారమైన విజన్‌ 2020.. విజన్‌-2047 సాధనకు అడుగులు.

12. విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక విజయాలు.

13. విపక్ష నేతగా విఫలమైన జగన్‌.

14. సహజ వనరుల పరిరక్షణ, అక్రమార్కులపై చర్యలు.

ఉమ్మడి తీర్మానాలు

1. తెలుగువారి చరిత్రలో ఎన్టీఆర్‌ ప్రత్యేకత.

2. తెలుగువారి చరిత్రలో చంద్రన్న మైలురాళ్లు/ముద్ర.

3. అమరులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఘన నివాళి.

4. కార్యకర్తల సంక్షేమం.

Updated Date - May 27 , 2025 | 05:55 AM