Share News

Driver Dastagiri : 20 కోట్ల డీల్‌పై 30 నిమిషాలే విచారణ!

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:29 AM

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌ మారిన డ్రైవర్‌ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసు 5వ నిందితుడు...

Driver Dastagiri : 20 కోట్ల డీల్‌పై 30 నిమిషాలే విచారణ!

  • డాక్టర్‌ చైతన్య రెడ్డిని అలా పిలిచి.. ఇలా పంపించేశారు

  • దస్తగిరిని బెదిరించిన ఘటనపై రెండోరోజు విచారణ తీరు

  • జైలర్‌ ప్రకాశ్‌నూ విచారించిన రాహుల్‌ శ్రీరామ

కడప, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌ మారిన డ్రైవర్‌ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసు 5వ నిందితుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్‌ చైత న్యరెడ్డి విచారణ 30 నిమిషాల్లో ముగియడం చర్చనీయాంశమైంది. ‘వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి మా రాజకీయ జీవితాన్ని నాశనం చేశావు. నీ వల్ల మా నాన్న శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి జైలుకెళ్లారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇబ్బందిపడుతున్నారు. మర్యాదగా మా మాటలు వింటే బాగుపడతావు. మేం చెప్పినట్లు చేస్తే రూ.20 కోట్లు అడ్వాన్సు ఇస్తాం. మీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటికే వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి సహకరిస్తున్నారు. నీవు అలాగే సహకరించు. లేదంటే నిన్ను నరికేస్తాం’ అంటూ కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న తనను బెదిరించారని దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యవహారంపై రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారి రాహుల్‌ శ్రీరామ కడప సెంట్రల్‌ జైలులో విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం దస్తగిరిని మూడు గంటల పాటు విచారించిన ఆయన శనివారం డాక్టర్‌ చైతన్యరెడ్డిని విచారణకు పిలిచారు.


అయితే, ఉదయం 11.30 గంటలకు వచ్చిన చైతన్యరెడ్డి కేవలం 30 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. 20 కోట్ల డీల్‌ను విచారణాధికారులు 30 నిమిషాల్లోనే ముగించారంటూ చర్చ నడుస్తోంది. మరోసారి విచారణకు రమ్మన్నారా? లేక విచారణ పూర్తి చేసి పంపించారా? అన్నది తెలియాల్సి ఉంది. మధ్యాహ్న భోజనం అనంతరం జైలర్‌ ప్రకాశ్‌ను రాహుల్‌ శ్రీరామ విచారించారు. దాదాపు మూడేళ్ల పాటు కడప జైలు సూపరింటెండెంట్‌గా ప్రకాశ్‌ పనిచేశారు. గత ఏడాది ఆగస్టు వరకు ఆయన ఇక్కడే కొనసాగారు. దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ కేసులో ప్రకాశ్‌ను ఏ2గా పేర్కొన్నారు. విచారణాధికారి రాహుల్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రదించగా ‘విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఎన్నిరోజులు జరుగుతుందో తెలియదు. పూర్తయిన తర్వాత మీడియాకు చెబుతాం’ అన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 03:29 AM