Krishna water : కృష్ణా ట్రైబ్యునల్-2పై సుప్రీం విచారణ 13కు వాయిదా
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:32 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ మరోసారి వాయిదాపడింది.
ఆ రోజు వాదనలకు సిద్ధంగా ఉండాలని కేంద్రం, తెలుగు రాష్ట్రాలకు ఆదేశం
న్యూఢిల్లీ/అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ మరోసారి వాయిదాపడింది. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు, రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను పునఃసమీక్షించేందుకు ఆ ట్రైబ్యునల్-2 కాలపరిమితి పొడిగింపును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదావేసింది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరుపుతామని.. రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్రం వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి గురువారంనాటి విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. అయితే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే కేటాయింపులపై విచారణకు కృష్ణా ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుందని, ఫిబ్రవరి 19 నుంచి అది విచారణ ప్రారంభించనున్న నేపథ్యంలో.. తాము గతంలోనే వేసిన రిట్ పిటిషన్‌పై వాదనలు విని తీర్పు ఇవ్వాలని కోరారు. అయితే ఫిబ్రవరి 6న గానీ లేదంటే 13వ తేదీన గానీ వాదనలు వినేందుకు ధర్మాసనం సంసిద్ధత తెలిపింది. ఈ రెండు తేదీల్లో ఒక దాన్ని ఎంచుకోవాలని గుప్తాకు సూచించింది. తనకు 6న మరో కేసు ఉందని.. అందుచేత 13కి వాయిదా వేయాలని ఆయన కోరారు. ఇందుకు ధర్మాసనం సమ్మతించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News