Srisailam Weather: శ్రీశైలంలో గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 01 , 2025 | 05:47 AM
శ్రీశైలంలో బుధవారం వడగళ్ళు, గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో చెట్లు కూలిపోవడం, రహదారులు జలమయం కావడం జరిగింది.
శ్రీశైలం, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో బుధవారం గాలివాన, వడగళ్లతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మధ్నాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొందరి ఇళ్లు, గోడలపై చెట్లు కూలాయి. క్షేత్ర పరిధిలో మొత్తంగా సుమారు 20 చెట్లు కూలగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎగువ అటవీ ప్రాంతంలో నుంచి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీల్లో వర్షపు నీరు పోటెత్తింది.