Steel Theft : హౌసింగ్ గోడౌన్‌లో 271 టన్నుల స్టీల్ మాయం
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:03 AM
స్టీల్ మాయమైంది. దీని విలువ రూ.1.95 కోట్లు ఉంటుందని అధికారులు తేల్చారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజబాబు...

దాని విలువ రూ.1.95 కోట్లు.. ఏఈ సస్పెన్షన్
మరో ఏఈ సహా 10 మంది అధికారులకు నోటీసులు
అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన మెటీరియల్ గోడౌన్‌లో పేదల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే 271 టన్నుల స్టీల్ మాయమైంది. దీని విలువ రూ.1.95 కోట్లు ఉంటుందని అధికారులు తేల్చారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజబాబు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో విజయవాడ సమీపంలోని గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న ఈ గోడౌన్ పర్యవేక్షణ బాధ్యతలు చూసే అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) బి.శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేశారు. మరో ఏఈ ఎం.శ్రీధర్‌కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీచేశారు. వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎన్టీఆర్ జిల్లా హౌసింగ్ ఉన్నతాధికారిని ఆదేశించారు. కాగా, సదరు గోడౌన్‌లో నిల్వ చేసిన విలువైన గృహ నిర్మాణ సామగ్రి పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మరో 9 మంది ఉన్నతాధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ తాఖీదులు అందుకున్న వారిలో ఇద్దరు హౌసింగ్ పీడీలు, ఇద్దరు ఈఈలు, మరో ఐదుగురు డీఈఈలు ఉన్నారు. వీరిలో నలుగురు రిటైర్డ్ అధికారులకు బెనిఫిట్స్ చెల్లించకుండా నిలిపివేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 జూన్ నుంచి 2024 జూన్ మధ్య కాలంలోనే స్టీల్ మాయమైనట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. దీనిపై విజయవాడ హౌసింగ్ డీఈఈ సమర్పించిన నివేదిక ఆధారంగా విజయవాడ ఆర్డీవో విచారణ నిర్వహించారు. రూ.1.95 కోట్ల విలువైన 271 టన్నుల స్టీల్ మాయమైందని ధ్రువీకరిస్తూ బాఽధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుకు ఆర్డీవో రిపోర్టు ఇచ్చారు. ఈ నివేదికపై తీవ్రంగా స్పందించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజబాబు తమ కార్యాలయ సిబ్బందితో మళ్లీ విచారణ చేయించారు. మూడోసారి కూడా గోడౌన్‌లో స్టీల్ మాయమైనట్లు ధ్రువీకరించడంతో బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News