Agriculture: వ్యవసాయ అనుబంధ వర్సిటీల విలీనం?
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:09 AM
ఈ నాలుగు వర్సిటీలు ఒకే గొడుగు కింద ఉంటే వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు, మత్స్య, పాడి రైతులకు అందే పరిశోధన ఫలితాల మధ్య అంతరాలను తొలగించే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

కూటమి ప్రభుత్వం పరిశీలనలో ప్రతిపాదన
అధ్యయనానికి త్వరలో నిపుణుల కమిటీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశువైద్య విశ్వవిద్యాలయాలను విలీనం చేసే ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నాలుగు వర్సిటీలు ఒకే గొడుగు కింద ఉంటే వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు, మత్స్య, పాడి రైతులకు అందే పరిశోధన ఫలితాల మధ్య అంతరాలను తొలగించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. వర్సిటీల ఏకీకరణపై మేనేజ్‌మెంట్, ఇతర విభాగాల అధికారుల నుంచి సూత్రప్రాయంగా అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యాన పరిశోధన విభాగాన్ని విడదీసి, పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం వ్యవసాయ వర్సిటీని గుంటూరు సమీపంలోని లాంలో నెలకొల్పారు. తిరుపతిలో పశువైద్య వర్సిటీ ఉండగా, దానినుంచి గత ప్రభుత్వం మత్స్య విభాగాన్ని విడదీసి, నరసాపురం వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ జారీ చేసింది. కానీ వర్సిటీకి తగిన భవనాలు నిర్మించలేదు. పరిపాలన విభాగాన్ని విజయవాడలోని అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు. నాలుగు వర్సిటీలకు వేలాది ఎకరాల భూములు, భవనాలు, వేలాది మంది ఉద్యోగులు ఉన్నా అయితే ఇవి వేర్వేరుగా ఉండటంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం కావడంతో పాటు వాటి మధ్య సమన్వయం లోపిస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీల ఏకీకరణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలను విలీనం చేసి, మత్స్య, పశువైద్య వర్సిటీలను యథావిధిగా కొనసాగించాలని కొందరు వాదిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో విలీన అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ముందుగా నిపుణుల కమిటీ వేసి, అధికారికంగా అభిప్రాయాలు సేకరించి, తదుపరి చట్టబద్ధంగా నిర్ణయం తీసుకునే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పరిశీలిస్తున్నారు. కాగా, వ్యవసాయ వర్సిటీలో సహజ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఉత్తర కోస్తాలో ఏర్పాటు చేయాలని, అటవీ విద్యల్లో యువతకు నైపుణ్యం కల్పించేలా ప్రకాశం జిల్లాలో కళాశాల, పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఇక ఉద్యాన వర్సిటీ కింద అనంతపురంలో ఔషధ, సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం, విజయనగరం/ విశాఖలో ప్లాంటేషన్ పంటలపై పరిశోధన కేంద్రం, చిత్తూరులో డెయిరీ విద్యకు కళాశాల, పరిశోధన స్థానం, శ్రీకాకుళంలో రొయ్యలు, ఉప్పునీటి మత్స్య పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..