Srikakulam:ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:36 AM
మీ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది?’ అంటూ ఆయననే అడిగారు. ఈ వింత అనుభవం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఎదురైంది.

ఎమ్మెల్యేకే టెలీకాలర్ ఫోన్!
కూన రవి కుమార్ సరదా స్పందన
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘ఎవ్వరినీ వదిలేది లేదు. అందరికీ కాల్ చేస్తాం. సమాచారం రాబడతాం’ అంటూ ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసేశారు. ‘మీ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది?’ అంటూ ఆయననే అడిగారు. ఈ వింత అనుభవం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఎదురైంది. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో ఉండగా ఫోన్ వచ్చింది. ఆయన స్పీకర్ ఆన్‌చేసి.. సరదాగా సమాధానాలు ఇచ్చారు. టెలీకాలర్, ఎమ్మెల్యే నడుమ జరిగిన సంభాషణ ఇదీ...
టెలీకాలర్: సర్, ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?
ఎమ్మెల్యే: ఎక్స్‌లెంట్.
టెలీకాలర్: ఆమదాలవలస ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?
ఎమ్మెల్యే: వాడో పనికిమాలిన వాడమ్మా.. పనికిమాలిన ఎమ్మెల్యేనమ్మా.
(దీంతో లాబీల్లో ఉన్నవారంతా నవ్వారు)
టెలీకాలర్: మీ నియోజకవర్గంలో అసంపూర్తి పనులు, సమస్యలు ఏమైనా ఉన్నాయా?
ఎమ్మెల్యే: నాకు అంత నాలెడ్జ్ లేదమ్మా!
టెలీకాలర్: మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా?
ఎమ్మెల్యే: బీసీ.
టెలీకాలర్: మీరు హిందువా.. ముస్లిమా?
ఎమ్మెల్యే: మా దగ్గర ముస్లింలు లేరమ్మా.
టెలీకాలర్: మీ కులం?
ఎమ్మెల్యే: కళింగ.
టెలీకాలర్: మీ వయసు ఎంత సర్?
ఎమ్మెల్యే: అమ్మా మగవాళ్ల వయసు.. ఆడవాళ్ల జీతం అడక్కూడదు!
టెలీకాలర్: ఫర్వాలేదు సర్ చెప్పండి.
ఎమ్మెల్యే: నాకు పెళ్లే కాలేదమ్మా!
టెలీకాలర్: పోనీ మీ వయసు 50 ఉంటుందా?
ఎమ్మెల్యే: పెళ్లికాలేదంటే 50 ఎలా ఉంటాయమ్మా?
టెలీకాలర్: మీరు వయసు చెప్పకపోతే సర్వే పూర్తికాదు సర్.
ఎమ్మెల్యే: నీవు విడిచిపెట్టేలా లేవు తల్లీ.. నీ సంతృప్తి కోసం చెబుతున్నా. నా వయసు 57 ఏళ్లు.
(దీంతో థ్యాంక్స్ సర్ అని టెలీకాలర్ కాల్ కట్ చేసింది.)