Special Privileges for Mithun Reddy: జైలా.. అత్తారిల్లా
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:26 AM
జైలు గదిలో 8 ఫ్యాన్లు.. జైలుకు వచ్చిన మూడో రోజు నుంచే కూలర్.. ఇంకా మినరల్ వాటర్, మం చం, టేబుల్, కుర్చీలు.. దుప్పట్లు మార్చడానికి, టేబు ల్, కుర్చీలు, గది శుభ్రం చేయడానికి ఖైదీలు..
రాజమండ్రిలో మిథున్ రెడ్డికి సకల సౌకర్యాలు
సెంట్రల్ జైలు అధికారులు జీ హుజూర్
సూపరింటెండెంట్ గదిలోనే ములాఖత్‌లు
గతంలో ఇదే జైలులో చంద్రబాబుకు ఆంక్షలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): జైలు గదిలో 8 ఫ్యాన్లు.. జైలుకు వచ్చిన మూడో రోజు నుంచే కూలర్.. ఇంకా మినరల్ వాటర్, మం చం, టేబుల్, కుర్చీలు.. దుప్పట్లు మార్చడానికి, టేబు ల్, కుర్చీలు, గది శుభ్రం చేయడానికి ఖైదీలు.. దోమ లు రాకుండా కిటికీలకు దోమ తెరలు.. మద్యం కేసు లో నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో సకల మర్యాదలూ జరుగుతున్నాయి. కోర్టు ఆదేశాలకు మించి అధికారులు సేవ లు కల్పిస్తున్నారు. వారంలో ఆదివారం తప్ప మిగతా ఆరు రోజులు కుటుంబీకులు, స్నేహితులు, న్యాయవాదులను మిథున్ రెడ్డి కలుస్తున్నారు. మిథున్ రెడ్డికి చేస్తున్న సేవలు వింటే జైలా.. అత్తారిల్లా అని ఆశ్చర్యపోతారు. ‘మిథున్ రెడ్డికి ఏమైనా కావాలంటే మాపై అధికారులకు చెప్పొద్దు. నాకు చెప్పండి.. నేను చేస్తాను’ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో జైలు ఉన్నతస్థాయి అధికారి అన్నారు. దీన్నిబట్టి జైలులో ఏమి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. డ్రైవర్‌ను చంపి ఇంటికి శవాన్ని డెలివరీ చేసిన కేసులో వైసీపీ నేత అనంతబాబు రిమాండ్‌లో ఉన్నప్పుడూ ఇలాగే సకల మర్యాదలూ జరిగాయి.
నాడు బాబుపై కక్షసాధింపు
14 ఏళ్లు సీఎంగా పనిచేసి, జాతీయ స్థాయి నేతల్లో ముఖ్యుడైన చంద్రబాబును 2023 సెప్టెంబరులో తప్పుడు కేసులో ఇదే జైలులో పెట్టినప్పుడు ఆనాటి వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ఆయన వయసును కూడా పరిగణనలోకి తీసుకోలేదు. చంద్రబాబు 53 రోజులు జైలులో ఉండగా, చాలా రోజుల పాటు కనీసం దోమ తెర కూడా ఇవ్వలేదు. బాత్‌రూమ్‌లో కమోడ్ ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు లాయ ర్ల పోరాటం తర్వాత ఆయన విడుదలకు నాలుగు రోజుల ముందు ఏసీ సదుపాయాన్ని కల్పించారు. అప్పటికే 50 రోజులు ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. .
సూపరింటెండెంట్ గదిలోనే..
జైలులో ములాఖత్‌ల విషయంలో రెండు విధాలు అనుసరిస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ, కుటుంబ సభ్యులు నిందితుడితో డిప్యూటీ సూపరింటెండెంట్ గదిలో కూర్చుని మాట్లాడవచ్చు. మిగతావాళ్లకు ఇనుప సెల్ ద్వారా అనుమతి ఉంటుంది. ఇప్పుడు మిథున్‌కు ఏకంగా సూపరింటెండెంట్ గదిలో కూర్చుని మాట్లాడుకొనే అవకాశమిస్తున్నారు. మిథున్‌తో ఎవరైనా ములాఖత్‌లో ఉన్నప్పుడు సూపరింటెండెంట్ గది దగ్గరకు ఎవరినీ రానివ్వడం లేదు. అక్కడ ఫోన్‌లో మాట్లాడుకున్నా బయటికి తెలిసే అవకాశం లేదు. ఉన్నతాధికారులు హెచ్చరించినా సూపరింటెండెంట్ పెడచెవిన పెట్టారని సమాచారం. ములాఖత్‌కు వచ్చిన వైసీపీ నేతలను జైలు డిప్యూటీ వార్డర్ స్థాయి అధికారి మొదటి గేటు నుం చి మెయిన్ గేటు వరకూ సాదరంగా తీసుకెళుతున్నారు.
ఇంటి భోజనం, టీవీ
చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ఆహారం విషయంలోనూ అతిగా తనిఖీలు చేశారు. ఆయన ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. బ్రౌన్ రైస్, ఒకటో రెండో కూరలు మాత్రమే జైలులోకి వెళ్లేవి. ఇప్పుడు మిథున్‌కు ఏకంగా రెండు మూడు బ్యాగుల్లో ఆహారం వెళుతోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇచ్చిన టీవీ సదుపాయం సెషన్స్ ముగిసినా కొనసాగుతోంది. ఆయనకు అటెండెంట్‌ను ఇవ్వడానికి జైలు మాన్యువల్ ఒప్పుకోదన్న జైలు అధికారులు ఇప్పుడు అనధికారికంగా ఖైదీలను సహాయకులుగా సేవలు చేయిస్తున్నారు.
నాడు, నేడు ఎంత తేడా
మిథున్ జైలుకు వచ్చి 46 రోజులైంది. సెలవులు పోను 36 రోజుల్లో 24 ములాఖత్‌లు ఇచ్చారు. లీగల్ ఇంటర్వ్యూలు మినహా ఫ్యామిలీ ములాఖత్‌లకు ఒక్కోదానికి గరిష్ఠంగా ముగ్గురికి అనుమతి ఉంటుంది. వీటి ద్వారా స్నేహితులు (37) ఎక్కువగా ఆయన్ను కలిశారు. తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4 సార్లు, భార్య 4 సార్లు, కొడుకు, సోదరి, పీఏ 2 సార్లు చొప్పున, తల్లి, బావమరిది, మామ, కజిన్ ఒక్కోసారి, అడ్వొకేట్ 5సార్లు మిథున్‌ను కలిశారు.
చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ములాఖత్‌లకు బాగా ఇబ్బంది పెట్టారు. వారానికి 3 ములాఖత్‌లను తర్వాత రెండుకు కుదించారు. లీగల్ ఇంటర్వ్యూలను ఒకటికి తగ్గించారు. వారానికి మూడు ఫ్యామిలీ, మూడు లీగల్ ములాఖత్‌లకు అప్పట్లో చంద్రబాబు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఆయన జైలుకు వచ్చిన రెండో వారంలో మూడోసారి ములాఖత్ కోసం భార్య దరఖాస్తు చేయగా, ఏవో కారణాలు చూపిస్తూ అధికారులు తిరస్కరించారు. లీగల్ ములాఖత్‌లు కూడా రోజుకు ఒక్కటే అంటూ జైలు అధికారులు ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాలనూ పక్కన పెట్టేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు ములాఖత్ అనుమతి తీసుకొని వాళ్లను కలిశారు. అంతే.. అప్పటి జైలు సూపరింటెండెంట్ రాజారావును ఉన్నపళంగా నెల్లూరు శిక్షణ కళాశాలకు అటాచ్‌మెంట్‌పై పంపిస్తూ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాలిచ్చారు. అప్పుడే విశాఖ జైలు నుంచి రాహుల్ సూపరింటెండెంట్‌గా వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ మిథున్‌కు అనుకూలం గా చేస్తానంటూ పెద్దిరెడ్డితో రాహుల్ చెప్పారు
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News