Somireddy Chandra Mohan Reddy: ఏదో తేడాగా ఉంది
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:05 PM
Somireddy Chandra Mohan Reddy: మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, వైసీపీ నేత దేవినేని అవినాష్‌ల అందాలు వైఎస్ జగన్ ఎప్పుడు చూశాడంటూ మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కంటే వైఎస్ అవినాష్ రెడ్డి అందంగా ఉంటాడని వైసీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 19: మగవాళ్ల అందం గురించి మరో మగాడైన వైఎస్ జగన్ మాట్లాడటం ఏదో తేడాగా ఉందని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్‌ల అందాలు వైఎస్ జగన్ ఎప్పుడు చూశాడని ఆయన సందేహం వ్యక్తం చేశారు. జగన్ కంటే అవినాష్ రెడ్డి అందంగా ఉంటాడని వైసీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు.
బుధవారం అమరావతిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల పరామర్శకు వెళ్లాడా? లేక మిరపకాయల దొంగతనానికి వెళ్ళాడా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ వెంట వెళ్లిన లేళ్ల అప్పిరెడ్డి 14 టిక్కీల మిర్చి బస్తాలు ఎత్తికుపోయారని ఆరోపించారు.
దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతూ, తండ్రికి బంగారు నగల దుకాణం ఉండి కూడా.. 3 అంతస్తుల మేడ ఉన్న ఓ పిల్ల చేత అమ్మఒడి రాలేదంటూ మంగళవారం పేటీఎమ్ బ్యాచ్‌తో డ్రామాలాడించావంటూ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. మొన్నీమధ్య వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు అనే చైల్డ్ ఆర్టిస్ట్ బాగా యాక్ట్ చేశాడని పేరొచ్చిందని.. సినిమాలకు చైల్డ్ ఆర్టిస్టుల కొరత ఉందని దర్శకులు అంటుంటే.... వారిని ట్రైన్ చేసే పనిలో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉందా? అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.
తన ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను మూసేసి.. ఎన్నో దారుణాలకు వైఎస్ జగన్ ఒడికట్టాడని మండిపడ్డారు. రైతులు కష్టాల్లో ఉంటే.. రౌడీలను వెంట పెట్టుకుని పోయి.. 14 మిర్చి టిక్కీలు దొంగతనం చేయిస్తావా? అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను నిలదీశారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపించాలంటూ వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు. ఎండు మిర్చికి కనీస మద్దతు ధర రూ. 7 వేలు నిర్ణయించింది మీరు కాదా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రశ్న సంధించారు.
మిర్చి రైతులకు, వ్యవసాయ రంగానికి జగన్ చేసిన నష్టంపై మాజీ వ్యవసాయ మంత్రులు కాకాణి గోవర్థన్ రెడ్డి కానీ.. కురసాల కన్నబాబు కానీ వీరిద్దరులో ఎవరు వచ్చినా.. తాను చర్చకు సిద్ధమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో ఎండు మిర్చికి నల్ల తామర తెగులు వచ్చినప్పుడు సీఎం వైఎస్ జగన్ ఎందుకు బయటకు రాలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు.
ఓ వైపు వేసవి కాలం.. మామిడి కాయలు కాచే కాలం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మామిడి పచ్చళ్ల పట్టుకుంటారు. అదీకాక.. కారానికి భారీగా ఉంది. అయినా.. ఎండు మిర్చి ధర పతనం అంచుకు చేరింది. కనీస మద్దతు ధర సైతం వారికి దక్కడం లేదు. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతోన్నారు. అలాంటి వేళ.. గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులను పరామర్శించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.
మరోవైపు పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోన్నాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు ఈసీ అనుమతి ఇవ్వలేదు. అయినా.. వైఎస్ జగన్ బుధవారం ఉదయం మిర్చి యార్డ్‌కు వెళ్లారు. ఆ సమయంలో రైతులను పరామర్శించి రైతులకు ధైర్యం చెప్పారు.
అంతేకాదు.. ఎండు మిర్చికి కనీస మద్దతు ధర కల్పించేలందంటూ చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలు.. జగన్ వ్యాఖ్యలపై తమదైన శైలీలో స్పందించారు. ఆ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై విధంగా స్పందించారు.
For AndhraPratesh News And Telugu News