Share News

Tirumala: భాస్కర నాయుడిని కాటేసిన నాగుపాము

ABN , Publish Date - Jun 29 , 2025 | 05:40 AM

తిరుమలలో భక్తులకు పాముల బెడద లేకుండా చేసే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడు.. పామును పట్టే క్రమంలో మళ్లీ పాము కాటుకు గురయ్యారు.

Tirumala: భాస్కర నాయుడిని కాటేసిన నాగుపాము

  • ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై టీటీడీ ఉద్యోగికి చికిత్స

  • ఇప్పటి వరకు 14 వేల పాములు పట్టిన ఘనత

తిరుమల, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తులకు పాముల బెడద లేకుండా చేసే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడు.. పామును పట్టే క్రమంలో మళ్లీ పాము కాటుకు గురయ్యారు. తిరుమలలోని గోగర్భం డ్యాం సమీపంలోని గార్డెన్‌లో శనివారం నాగుపామును పట్టుకుని బ్యాగులో వేస్తుండగా అతడి ఎడమచేతిపై కాటేసింది. రెండు నిమిషాల్లోనే కుప్పకూలిన భాస్కర నాయుడిని అక్కడి ఉద్యోగులు హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. విషం విరుగుడు మెడిసన్‌(యాంటీ వీనం) ఇచ్చినప్పటికీ పరిస్థితి విషమంగా మారడంతో వెంటిలేటర్‌పై తిరుపతిలోని అమర ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.


1982లో టీటీడీ అటవీశాఖలో కార్మికుడిగా చేరిన భాస్కర నాయుడి నైపుణ్యం గమనించి పాములు పట్టేందుకు ఆయనకు ప్రత్యేక విధులు కేటాయించారు. 2021లో రిటైరైనప్పటికీ కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 14 వేలకు పైగా పాములు పట్టారు. 2022 జనవరిలో ఒకసారి తిరుపతిలో విషపూరితమైన పాము కాటేయడంలో నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని మళ్లీ విధుల్లోకి చేరారు. కాగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని టీటీడీ అటవీ విభాగ అధికారులు తెలిపారు.

Updated Date - Jun 29 , 2025 | 05:40 AM